పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం..

by Sumithra |
పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం..
X

దిశ, భిక్కనూరు : గ్యాస్ ముట్టించి.. స్టవ్ పై చాయి పెట్టుకుంటుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తుప్పాతుల సత్తెవ్వ తన ఇంట్లో చాయి పెట్టుకునేందుకు స్టవ్ వెలిగించింది. ఇంతలో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన సత్తెవ్వ భయపడిపోయి బయటకు పరుగులు పెట్టింది. పరిగెత్తుతున్న సమయంలో నెత్తి వెంట్రుకలు అంటుకోవడంతో అరుపులు కేకలు పెడుతూ పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈలోపు భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో వృద్ధురాలు నివాసముంటున్న ఇల్లు ధ్వంసమై, పైన ఉన్న సిమెంటు రేకులు చెల్లాచెదురుగా ఎగిరి చుట్టుపక్కల ఇండ్ల పై పడ్డాయి.

నెలనెలా వచ్చిన పెన్షన్ డబ్బులను కుండలో దాచి పెట్టుకోగా, సుమారు లక్ష రూపాయల 500 నోట్లు కాలి పోయాయి. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఇండ్లలో నుంచి బయటకు వచ్చారు. సిలిండర్ ఎలా పేలిందని ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధురాలు సత్తెవ్వను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినప్పటికి, కళ్లెదుటే ఇల్లు ధ్వంసమై నిరాశ్రయురాలు కావడంతో ఏడ్చుకుంటూ కూర్చుంది. బాధితురాలికి ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ, గత కొన్నాళ్లుగా ఒంటరిగానే నివాసం ఉంటుంది.

Next Story

Most Viewed