రక్తం గడ్డకట్టి.. టీకా తీసుకున్న ఏడుగురు మృతి..

by Anukaran |   ( Updated:2021-04-04 02:24:02.0  )
రక్తం గడ్డకట్టి.. టీకా తీసుకున్న ఏడుగురు మృతి..
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, పలు టీకాల సామర్థ్యంపై కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా యూకేలో ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టిన సమస్యలతో వారు చనిపోయినట్టు యూకే ఔషధ నియంత్రణ సంస్థ నిర్ధారించింది.

మార్చి 24వ తేదీ వరకు 1.81 కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే 30 మందిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తిందని, వారిలో ఏడుగురు మరణించారని మెడిసన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) వెల్లడించింది. రక్తం గడ్డ కట్టే సమస్య కేవలం ఈ వ్యాక్సిన్‌ ద్వారా వచ్చిందా లేదా వారిలో మరేమైనా అనారోగ్య సమస్యలున్నాయా అన్న దానిపై విచారణ జరుపుతోంది.

కోట్లాది మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే కొంతమందిలో ఏదో ఒక దుష్ప్రభావం కనిపించడం సాధారణంగా జరిగేదేనని ఆ సంస్థ తెలిపింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లోని పుణేలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌తో భారత్‌లో ఎలాంటి సైడ్‌ అఫెక్ట్‌లు కనిపించలేదు. ఈ వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమని, నిర్భయంగా అందరూ టీకా తీసుకోవచ్చునని సంస్థ స్పష్టం చేసింది.

Advertisement

Next Story