ఏడెకరాల సర్కారీ భూమి మాయం!

by Shyam |
ఏడెకరాల సర్కారీ భూమి మాయం!
X

దిశ, హైదరాబాద్:
అసలే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న ప్రభుత్వం సర్కారీ భూములను అమ్ముకుని ఆదాయం ఆర్జించాలనుకుంది. కానీ, ప్రభుత్వానికే తెలియకుండా నగరంలోని విలువైన భూములు మాయం అవుతున్నాయి. ఆ భూములు ఎలా మాయమవుతున్నాయో వీఆర్వో మొదలు కలెక్టర్ వరకు ఎవరికీ అంతుచిక్కడంలేదు. లంచాల్లో కూరుకుపోయిన రెవిన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని, కొత్త చట్టంతో ఆట కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కానీ, ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. సరూర్‌నగర్‌లో ఏడు ఎకరాల భూమి మాయమైంది. ఇది ప్రభుత్వ భూమి కావడంతో అడిగే నాథుడు లేకుండా పోయారు. ఎంతలేదన్నా దీని ధర రూ. 300 కోట్లకుపైగానే ఉంటుంది.

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే సమయానికి (1954-55) సరూర్‌నగర్ మండల పరిధిలోని బహదూర్‌గూడ గ్రామ పహాణీలో సర్వే నెం. 49/13లో 77.13 ఎకరాల ప్రభుత్వ (సర్కారీ కంచె) భూమి ఉండగా ముప్పై ఏళ్ళ తర్వాత (1985-86) అది 58.20 ఎకరాలకు తగ్గిపోయింది. ఒక్కో సంస్థకు ఒక్కో తీరులో భూమిని కేటాయించడం, విక్రయించడం జరిగిపోయిన తర్వాత సుమారు ఏడు ఎకరాల మేర భూమి ఎవరికి కేటాయించిందీ లెక్కల్లో తేలకుండా పోయింది. ప్రస్తుతం ఒక్కో చదరపు గజం భూమి విలువ అక్కడ సుమారు లక్ష రూపాయల వరకు పలుకుతోంది. మాయమైన భూమి విలువను లెక్కిస్తే సుమారు రూ.300 కోట్లకు పైగానే ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందనేది గోప్యంగా ఉండిపోయింది. వీఆర్వో, సర్వేయర్, తాసీల్దారు మొదలు జిల్లా కలెక్టర్ వరకు ఎంత లెక్క తేల్చినా ఈ భూమి రికార్డుల్లో మాత్రం కనిపించడంలేదు.

కానీ, అక్కడ వాణిజ్య సముదాయాలు ఒక్కటొక్కటిగా కొత్తవి పుట్టుకొస్తూ ఉన్నాయి. స్థానిక అధికార పార్టీ నాయకుడి హస్తం కూడా ఉందనే వార్తలూ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే… సర్వే నెం. 49/13లో మొత్తం 58.20 ఎకరాల భూమి ఉన్నట్లు లెక్క తేలింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక గెజిట్‌ను (నెం. ఎల్ ఆర్ బి/బి25/77) 1997 జూన్ 26న విడుదల చేసింది. ఈ మొత్తం భూమి దేవాదాయ శాఖకు చెందినదిగా నిర్ధారించింది. అయితే అప్పటికే విజయవాడకు చెందిన సిరీస్ (సౌత్ ఇండియా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్)కు 14.31 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు (జీవో ఎంఎస్ నెం. 1213) ఖరారుచేసింది. ఆ తర్వాత మరో మెమో (నెం. 5442)ను జారీ చేసి ఒక్కో ఎకరానికి రూ. 3,000 చొప్పున ధరను నిర్ణయించింది. ఆ ప్రకారం రెండు వాయిదాల్లో మొత్తం రూ. 1.07 లక్షలను సిరీస్ కంపెనీ చెల్లించి 14.31 ఎకరాలను స్వాధీనం చేసుకుంది.

ఆ తర్వాత భారత్ ఇన్సులేటర్స్ లిమిటెడ్ అనే సంస్థకు, టెలిఫోన్ ఎక్స్ఛేంజికి నాలుగు ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఎల్బీనగర్ పేద ప్రజల నివాస సౌకర్యం కోసం 31 ఎకరాల (712 ప్లాట్లకు మొత్తం 1,57,590 గజాలు)ను కేటాయించింది. ఈ ప్రకారం మొత్తం 51.31 ఎకరాల భూ కేటాయింపులు జరిగిపోయాయి. ఇక మిగిలిన 6.89 ఎకరాల భూమి ఏమైపోయిందో తెలియలేదు. ఈ విషయమై సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు సైతం స్పష్టమైన సమాధానం రాలేదు. అయితే ఈ భూమి అన్యాక్రాంతమైందని, దానికి తగిన ఆధారాలు ఉన్నాయంటూ తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ సరూర్‌నగర్ తాసీల్దారుకు రెండున్నరేండ్ల క్రితమే వివరించింది. కానీ, ఇప్పటికీ దానిపై రెవిన్యూ అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం.

అయితే ఇలా అన్యాక్రాంతమైన భూమిలో ఇప్పుడు ప్రముఖ వాణిజ్య సంస్థలు బహుళ అంతస్తుల భవనాలను కట్టుకున్నట్లు తేలింది. ఇదే విషయమై ఈ సంస్థ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఆరున్నర ఎకరాలకుపైగా భూమిని సిరీస్ కంపెనీ ఆక్రమించిందని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మరో లేఖలో వివరించింది. సిరీస్ అనే సంస్థ తనకు కేటాయించిన భూమిని కమర్షియల్ కాంప్లెక్స్ యజమానులకు అమ్ముకున్నట్లు ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపిన రెవిన్యూ అధికారులు సిరీస్ కంపెనీ తాను ప్రభుత్వం నుంచి కొనుగోలుచేసిన భూమిని ‘షేర్ హోల్డర్ల’కు, థర్డ్ పార్టీలకు అమ్ముకుందని సరూర్‌నగర్ తాసీల్దారు గతేడాది మార్చి 5న లిఖితపూర్వకంగా వివరించారు. కానీ, లెక్కలోకి రాకుండా మాయమైపోయిన 6.89 ఎకరాల భూమి గురించిన వివరాలను మాత్రం ఇవ్వలేకపోయారు.

ఏండ్లు గడుస్తున్నా మాయమైపోయిన భూమి వివరాలు మాత్రం వెలుగులోకి రావడం లేదు. లిఖితపూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నా, సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నా వివరాలు మాత్రం గోప్యంగానే ఉండిపోయాయి. ఫోర్జరీ పత్రాలతో ప్రైవేటు వ్యక్తుల భూములు కబ్జాకు గురవుతున్నట్లు వార్తలు నిత్యకృత్యమే. కానీ, ప్రభుత్వ భూమి కూడా మాయమైపోతూ ఉంటే ఆ దిశగా దర్యాప్తు జరిపి ఆక్రమణల నుంచి తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలు మాత్రం శూన్యం. అధికార పార్టీ నేతల హస్తం ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్న సమయంలో ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ ఉండడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed