ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి రూ.603 కోట్లు

by Shyam |
ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి రూ.603 కోట్లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి (కాంపెన్సేటరీ ఎఫోరెస్టేషన్) అవసరమయ్యే నిధులపై స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కమిటీ సమావేశం సుమారు రూ.603 కోట్లతో వార్షిక ప్రణాళికను ఆమోదించింది. ఈ నిధులతో ప్రత్యామ్నాయ అడవుల పెంపకంతో పాటు క్యాచ్‌మెంట్ ఏరియా ట్రీట్‌మెంట్, సమగ్ర వన్యప్రాణి నిర్వహణా ప్రణాళిక సహా పలు కేటగిరీల కింద పనులు చేపట్టడానికి ఆస్కారం ఏర్పడింది. ప్రతీ ఏటా ‘కాంపా’ నిధులతో ప్రత్యామ్నాయ అడవుల పెంపకం పనులు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరానికి రూ. 603 కోట్ల ప్రణాళిక సిద్ధమైంది. ఇదే నిధులతో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్టు బ్లాక్‌లను కూడా అభివృద్ధి చేయనున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. హరితహారం పథకంలో భాగంగా ఇప్పటికే నగరంలోని ఇన్నర్, ఔటర్ రింగు రోడ్డు ప్రాంతాలతో పాటు టౌన్‌షిప్, పెద్దపెద్ద అపార్టుమెంట్ల దగ్గర అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను అటవీ శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు ‘కాంపా’ నిధులతో ఇవి జరగడానికి వెసులుబాటు లభించింది. ఈ కమిటీ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శోభ, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ పిసిసిఎఫ్ లోకేష్ జైస్వాల్, అడిషనల్ పిసిసిఎఫ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story