Health Department: మాస్క్ సక్కగ ధరించేది 7 శాతమే : ఆరోగ్య శాఖ

by Shamantha N |   ( Updated:2021-05-21 03:03:16.0  )
Health Department: మాస్క్ సక్కగ ధరించేది 7 శాతమే : ఆరోగ్య శాఖ
X

దిశ, ఫీచర్స్ : కరోనా కట్టడికి వ్యాక్సిన్లు, మెడిసిన్లు ఎన్నొచ్చినా.. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌, సోషల్ డిస్టెన్స్‌ను మించిన ఆయుధం లేదు. ఫస్ట్ వేవ్ నుంచి కరోనా కేసులను పరిశీలిస్తే, పాజిటివ్ కేసులు నగర ప్రాంతాల్లోనే ఎక్కువ నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్ క్రమంగా వ్యాపిస్తోంది. అయినప్పటికీ ప్రజలు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ మేరకు దేశ జనాభాలో 50 శాతం మంది మాస్క్ ధరించడం లేదని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది.

దేశంలోని 25 నగరాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 32 శాతం ప్రజలు ముక్కు కిందకు, 10 శాతం మంది దవడ కిందకు, 1 శాతం వారు మాస్క్‌ను మెడలో ధరిస్తుండగా.. 7 శాతం జనాలు మాత్రమే ముక్కు, నోరు, దవడ పూర్తిగా కవర్ అయ్యేలా కరెక్టుగా ధరిస్తున్నారని తేలింది. ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. 9 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష వరకు, 19 రాష్ట్రాల్లో 50 వేల కన్నా తక్కువ కేసులు ఉన్నట్టు తెలిపారు. కాగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో 25 శాతానికి మించి పాజటివిటీ రేటు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక గత మూడు వారాలుగా తమిళనాడు, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మిజోరం రాష్ట్రాల్లో కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని లవ్ అగర్వాల్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed