సరస్వతి పుత్రిక .. రెండుగంటల్లో 36 పుస్తకాలు చదివిన చిన్నారి

by Shamantha N |
సరస్వతి పుత్రిక .. రెండుగంటల్లో 36 పుస్తకాలు చదివిన చిన్నారి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఇంటర్నెట్ యుగంలో పుస్తకం చదవడమంటే అదో సాహసమని బావిస్తున్న రోజులివి. పెద్ద వాళ్లు, పుస్తకాల మీద ఇష్టమున్న వాళ్లు సైతం బిజీ లైఫ్‌లో పడి కుదురుగా అరగంట పాటు పుస్తకం చదవాలంటేనే అదేదో పడరాని ప్రయాస అని అనుకుంటున్నారు. చిన్నారుల సంగతి వేరే చెప్పాలా..? పుస్తకాలు తీస్తేనే నిద్ర దేవత వారిని ఆవహిస్తున్నది. కానీ ఈ చిన్నారి మాత్రం వారికి పూర్తిగా డిఫరెంట్. తనకు పది పుస్తకాలు ఇచ్చి ఏకబిగిన చదవమన్నా.. విరామం లేకుండా చదివేయడం ఈ బాలికకు వెన్నతో పెట్టిన విద్య. పుస్తకాలు, చదువు మీద అంత ప్రేమ ఉంది కాబట్టే ఐదేళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 36 పుస్తకాలను రెండు గంటల్లోపే చదివేసింది.

అబుదాబిలో ఉంటున్న ఇండో అమెరికన్ చిన్నారి కియారా కౌర్ కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. బొమ్మలతో ఉన్న పుస్తకాలను చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. కియారా పాపాయిగా ఉన్న సమయంలో తన తాతయ్య చెప్పే కథలను ఎక్కువగా వినేదట. ఆ ఆసక్తే పుస్తకాలను చదవడానికి ప్రేరేపించింది. ఇంట్లో గానీ, బయటకు తీసుకెళ్లినా గానీ ఏ చిన్న పేపర్ ముక్క కనిపించినా దానిని తీసుకోని చదివేయడం అలవాటుగా చేసుకున్న కియారా.. పుస్తకాల పురుగు అయిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 105 నిమిషాల పాటు ఏకబిగిన 36 పుస్తకాలను చదివింది. దీంతో ఆమె లండన్ వరల్డ్ రికార్డ్, ఆసియా వరల్డ్ రికార్డులలో స్థానం సంపాదించింది.

ఇదే విషయమై కియారా మాట్లాడుతూ..‘నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఎక్కడికెళ్లినా చేతిలో పుస్తకం తీసుకెళ్తా. ఫోన్లలో ఆటలు ఆడటం, వీడియో గేమ్స్ కంటే నాకు పుస్తకాలు చదవడమంటేనే ఇష్టం. ఆన్లైన్ లో కంటే పుస్తకాలను డైరెక్టుగా చదివేయడమే నాకు సౌకర్యంగా ఉంటుంది’ అని చెప్పింది. భవిష్యత్తులో డాక్టర్ కావాలని ఆశిస్తున్న ఈ చిన్నారికి ఆల్ ది బెస్ట్.

Advertisement

Next Story