- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాలుతున్న రైతులు.. మూడేళ్లలో 49 వేల మంది మృతి
దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు శవాలవుతున్నారు. 59 ఏండ్లలోపు రైతులు మూడేండ్లలో 49 వేల మంది ఊపిరి వదిలారు. ఇవన్నీ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలే. రైతుబీమా కింద ఈ మూడేండ్ల కాలంలో చనిపోయిన రైతులకు పరిహారం అందించిన జాబితాలో 49,755 మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో వేర్వేరు కారణాలతో చనిపోయినా.. వ్యవసాయం భారమై తనువు చాలించిన రైతులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది ఇప్పటి వరకు 688 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రైతు సంఘం వెల్లడించింది. గతేడాది అధికారిక లెక్కల ప్రకారం 468 మంది సూసైడ్ చేసుకోగా… వాస్తవంగా వెయ్యిమందికిపైగా ఉంటారని రైతు ఐక్య వేదిక పేర్కొంటోంది.
49,755 మందికి బీమా సాయం
రాష్ట్రంలో మొత్తం 32.33 లక్షల మంది అర్హులైన రైతుల కోసం 2018-19, 2019-20, 2020-21 మూడేండ్లలో ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు కోసం రూ. 2917.39 కోట్లను ప్రీమియంగా ఎల్ఐసీకి చెల్లించినట్లు ఇటీవల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది కూడా (2021-22)లో రూ.1200 కోట్ల బీమా ప్రీమియం చెల్లించింది.
ఇక రాష్ట్రంలో ఈ ఏడాది మే నెలాఖరు నాటికి 49,755 మంది రైతులు చనిపోగా, వీరి కుటుంబాలకు రూ. 2488.75 కోట్ల బీమా మొత్తం అందించినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 49,755 మంది రైతులు ఈ మూడేండ్లలో మృత్యువాత పడినట్లు స్పష్టమవుతోంది. మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం ఎంత మేరకు అందుతోంది.. ఆర్థికంగా ఎంత మేరకు తోడ్పాటు అవుతుందనే అంశాలను పక్కన పెడితే రైతులు మాత్రం ఏటేటా చనిపోతూనే ఉన్నారు.
లెక్కలోకి రాని మరణాలు
రైతు మరణాల వివరాల ప్రకారం 49,755 మంది చనిపోగా.. వీరంతా 59 ఏండ్లలోపు వారే. రైతుబీమా కూడా వీరికే వర్తిస్తోంది. ఈ లెక్కన వృద్ధాప్యంతో చనిపోయిన వారు కాదన్నట్టే. యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, అనారోగ్యం… ఇలా కారణాలేమైనా రైతుల మరణాలు మాత్రం ఎక్కువగా ఉండటం ఆందోళన కల్గించే అంశమే. కేవలం మూడేండ్లలో ఇంతస్థాయిలో రైతు మరణాలు నమోదు కావడంపై రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అప్పులతోనే రైతులకు తిప్పలు
పొలం గట్టుమీద నాగలి భుజాన వేసుకొని నడుస్తున్న రైతు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాడు. నేలని దున్నాల్సిన రైతు తన దేహాన్ని చీల్చేస్తున్న అప్పులతో కుంగిపోతున్నాడు. ఏ రైతును చూసినా కష్టమే! సాగు నష్టమే! ఎక్కడికక్కడ పచ్చగా కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు శవాలను మొలిపించి రైతు రక్తంతో ఎర్రబారుతున్నాయి. 1995 నుంచి 2016 వరకు దేశ వ్యాప్తంగా 2,96,438 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిఏటా రైతు ఆత్మహత్యల సంఖ్య సగుటన 12 వేలు దాటుతోంది. ఇది 2020 వరకూ కొనసాగింది.
2020లో కూడా జాతీయ నేర సమాచార విభాగం చెప్పిన అధికారిక సమాచారం ప్రకారం 12,020 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. అదే విధంగా ఈ ఏడాది రైతు సంఘాల లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటికే 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే… మన రాష్ట్రంలో ఈ సంఖ్య 688గా ఉంది. దీనికి కారణాలను సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతు సురాజ్య వేదిక, యాక్షన్ ఎయిడ్, జయతీ ఘోష్ కమిటీ తదితర సంస్థలు, సంఘాలు విశ్లేషించాయి.
ఒక్క వరి బస్తా పండించడానికి రైతుకు సగటున రూ. 1600లు ఖర్చు అయితే, వారికి లభించేది రూ. 1200 మాత్రమే. ఎన్నికల్లో భారీ హామీలిచ్చి అధికారాన్ని కైవసం చేసుకున్న పార్టీలన్నీ అరకోర సాయం తప్ప… పూర్తిస్థాయిలో రైతులను ఆదుకోలే తీర్చలేకపోతున్నారు. మొత్తానికి దేశానికి వెన్నుముక అని కీర్తించే రైతు నేల రాలుతున్నాడు.
రైతు మరణాలను పలు సంస్థలు ఈ కింది విధంగా విశ్లేషించాయి.
* వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి.
* బోర్లపై ఆధారపడటం అధికమైంది.
* కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు.
* మద్దతు ధర దక్కడం లేదు.
* పెట్టుబడులు పెరుగడం, మద్దతు ధర లేకపోవడంతో ఏటేటా అప్పులు పెరుగుతున్నాయి.
* రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించటంపై అవగాహన లేకుండా పోయింది.
* వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది.
* ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే.