అనంతగిరి మండలంలో ఖనిజం కలకలం.. అధికారుల ఎంట్రీతో సీన్ రివర్స్

by Shyam |
barite
X

దిశ, అనంతగిరి: నల్గొండ జిల్లా విజిలెన్స్ అధికారులు దాదాపు 3లక్షల విలువ గల నిల్వ ఉంచిన 50 మెట్రిక్ టన్నుల బెరైటిస్ ఖనిజాన్ని జప్తు చేశారు. దానిని అనంతగిరి మండల రెవిన్యూ సిబ్బందికి అప్పజెప్పారు. తహశీల్దార్ వాజిద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండల పరిధిలోని మొగలాయికోట గ్రామ శివారులో సర్వే నెం.62 గల పట్టా భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా బెరైటీస్ ఖనిజం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో నల్లగొండ జిల్లా విజిలెన్స్ అధికారులు సంబంధిత ప్రాంతానికి చేరుకొని ఖనిజాన్ని స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యల ప్రకారం దానిని మండల రెవెన్యూ సిబ్బందికి అప్ప చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు.

ఈ ఖనిజాన్ని కొంతమంది అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఖమ్మం జిల్లా నుండి దిగుమతి చేసి మండల పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉంచుతూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. ఈ ఖనిజాల విలువ ప్రస్తుతం మార్కెట్లో ఒక టన్ను సుమారు 5 వేల నుండి 8వేల వరకు ఉంటుందని జిల్లా అధికారులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖనిజాన్ని నిల్వ ఉంచిన భూమి యజమానితో పాటు అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాంబాబు, మహేష్, రాయల్టీ ఇన్స్పెక్టర్ పి.కృష్ణంరాజు, మండల రెవెన్యూ అధికారి గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed