ఒంటిచేత్తో ‘ఆఫ్ రోడ్ అడ్వెంచర్స్’.. కశ్మీర్ యువకుడి సాహసయాత్ర

by Shyam |
Sayer Abdullah
X

దిశ, ఫీచర్స్: ఒక చేయి కోల్పోయినా, పట్టుదలతో ఒంటి చేత్తో కారు డ్రైవింగ్ నేర్చుకొని వైకల్యాన్ని ఓడించాడు కశ్మీర్‌కు చెందిన అబ్దుల్లా. యాక్సిడెంట్ కారణంగా చేయి కోల్పోయి డిప్రెషన్‌కు గురైన అబ్దుల్లా ప్రజెంట్ కశ్మీర్ ఘాట్ రోడ్లపై రయ్..రయ్‌మంటూ సాగిపోతూ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నాడు. కశ్మీర్ వ్యాలీలోని ‘కశ్మీర్ ఆఫ్ రోడ్’ అడ్వెంచర్‌‌లో సభ్యుడిగా సాహస యాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 2011లో కశ్మీర్ రహదారిపై వెళ్తున్న ఓ స్కూల్ బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. అదృష్టవశాత్తు చాలా మంది విద్యార్థులు స్పల్ప గాయాలతో బయటపడగా, 11 ఏళ్ల అబ్దుల్లాకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. స్పృహకోల్పోయిన అబ్దుల్లాను శ్రీనగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. కుడి చేయి పూర్తిగా విరిగిపోవడంతో దాన్ని వైద్యులు తొలగించారు. తన చేయి లేకపోవడాన్ని అబ్దుల్లా ఓర్చుకోలేకపోయాడు. చాలా బాధపడి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కొత్త జీవితానికి అనుగుణంగా మారాలని అనుకున్నప్పటికీ, ఒంటికి తగిలిన గాయాలు, మనసు నొప్పించిన గాయాలు నయం కావడానికి చాలా సమయం పట్టింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు అతడికి అండగా నిలిచి అతడిలో ధైర్యాన్ని నింపారు. ఇక అప్పటి నుంచి కుటుంబ సభ్యుల సాయంతో అన్ని పనులనూ ఒంటిచేత్తో చేసేందుకు ప్రయత్నించి..నేర్పుతో ఏడాది కాలంలోనే అబ్దుల్లా ఒంటిచేత్తో షూలేస్ కట్టుకోవడం, బట్టలు ధరించడం, శుభ్రపరచడం నేర్చుకున్నాడు.

‘పాఠశాలకే కాదు బయటకు వెళ్లాలన్నా..నా మనసు అందుకు అంగీకరించలేదు. అందరూ నన్నే గమనిస్తున్నారని చింతించేవాడ్ని. నా స్నేహితుడు బయటకు తీసుకెళ్లి ఒంటిచేత్తోనే బ్యాటింగ్, బౌలింగ్ చేయాలని ప్రోత్సహించాడు. అంతేకాదు మరో మిత్రుడు ఒక చేయితోనే డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పించాడు. దాంతో ఏడాదిన్నర వ్యవధిలోనే కశ్మీరి గ్రామీణ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టేవాణ్ణి. డ్రైవింగ్ నాకు మానసిక ఉల్లాసాన్ని అందించింది. మెల్లమెల్లగా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్‌తో నెగెటివ్ ఆలోచనల నుంచి బయటపడ్డాను. ఎవరి సాయం లేకుండా నా పనులు నేను చేసుకోవాలని మా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు. నేను కూడా అందులోని వాస్తవాన్ని గ్రహించి అన్ని పనులను నేర్చుకున్నాను. భవిష్యత్తులో కారులోనే లండన్ వెళ్లాలనుకుంటున్నాను. దేశం మొత్తం కారులోనే తిరగాలనుకుంటున్నాను. ఏదో ఒక రోజు నా కలను తప్పకుండా ఫుల్‌ఫిల్ చేసుకుంటాను. ఆఫ్-రోడింగ్ నా జీవితం. ఇదే నా దృక్పతాన్ని మార్చింది’ అని చెప్పుకొచ్చారు అబ్దుల్లా.

వ్యాలీలో ఉన్న ఏకైక ఆఫ్-రోడ్ అడ్వెంచర్ ‘కశ్మీర్ ఆఫ్ రోడ్’ (KO)లోనూ అబ్దుల్లా డ్రైవింగ్ చేసి ఔరా అనిపించాడు. అక్కడున్న ట్రాక్స్‌కి అనుకూలంగా తన కారు లేనప్పటికీ అబ్దుల్లా దాన్ని అధిగమించి డ్రైవింగ్ చేయడంతో ‘కశ్మీర్ ఆఫ్ రోడ్’ నిర్వాహకులకు అబ్దుల్లా ప్రతిభపై నమ్మకం వచ్చింది. ఇక అక్కడి నుంచి అబ్దుల్లా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘కశ్మీర్ ఆఫ్ రోడ్’‌ చేరిన అతి పిన్న వయస్కుడిగా అబ్దుల్లా నిలిచాడు. కశ్మీర్ ఆఫ్ రోడ్ అనేది మోటార్స్ స్పోర్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అసోసియేట్ మెంబర్ క్లబ్ కాగా ఇందులో భాగంగా ఆఫ్-రోడ్ అడ్వెంచర్, మోటార్-స్పోర్ట్ ఈవెంట్స్, అంతర్జాతీయ ఓవర్‌ల్యాండ్ యాత్రలు ఉంటాయి. అబ్దుల్లా ప్రస్తుతం హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లా డిగ్రీ చేస్తుండగా, కార్పొరేట్ లాయర్‌గా కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నాడు. అయితే కెరీర్‌‌ను బ్యాలెన్స్ చేస్తూ ‘ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్స్’ చేస్తూనే ఉంటానని అబ్దుల్లా చెప్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed