CWC Qualifiers 2023: వరల్డ్‌కప్‌ అర్హతకు చేరువలో లంక..

by Vinod kumar |
CWC Qualifiers 2023: వరల్డ్‌కప్‌ అర్హతకు చేరువలో లంక..
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అంశంలో శ్రీలంక మరింత దగ్గరైంది. వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో సూపర్‌ సిక్స్‌లో భాగంగా శుక్రవారం నెదర్లాండ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 214 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 40 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో నెదర్లాండ్స్‌ విజయం దిశగా నడిచి శ్రీలంకను వణికించింది. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ 68 బంతుల్లో 67 పరుగులు చేయగా.. వెస్లీ బార్సీ 52 పరుగులు, బాస్‌ డీ లీడే 41 పరుగుల చేశారు. లంక బౌలర్లలో మహీషా తీక్షణ 3 వికెట్లు తీయగా.. వనిందు హసరంగా 2 వికెట్లు పడగొట్టగా.. లాహిరు కుమారా, మధుషనక, షనకలు తలా 1 వికెట్‌ తీశారు.

అంతకముందు మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నెదర్లాండ్స్‌ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఒక దశలో 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ధనుంజయ డిసిల్వా తన కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో డిసిల్వా 93 పరుగులు చేశాడు. వనిందు హసరంగా (20), మహీశ్‌ తీక్షణ (28) పరుగులు చేయగా.. ఓపెనర్‌ కరుణరత్నే (33) పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో.. లోగన్‌ వాన్‌ బీక్‌, బాస్‌ డీ లీడేలు చెరో 3 వికెట్లు తీయగా.. సాబిక్‌ జుల్పికర్‌ 2, రియాన్‌ క్లెయిన్‌, ఆర్యన్‌ దత్‌లు తలా 1 వికెట్‌ తీశారు. ఈ విజయంతో శ్రీలంక వరల్డ్‌కప్‌ అర్హతకు మరింత చేరువైంది. ప్రస్తుతం లంక ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి.

Advertisement

Next Story