మేడ్చల్‌లో కొత్తగా 15 బస్తీ దవాఖానాలు

by Shyam |   ( Updated:2020-05-19 10:29:58.0  )

దిశ, హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా 15 బస్తీ దవఖానాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా వైద్యాఆరోగ్య శాఖాధికారులతో కీసరలోని కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య రీత్యా వైద్య సేవలు అందించేందుకు ఈ నెల 22న జిల్లాలో 15 బస్తీ దవఖానాలను, స్థానిక ప్రజా ప్రతినిధులచే ఉదయం 11 గంటలకు ప్రారంభించాలని సూచించారు. ఈ దవఖానాలలో తాగునీటి వసతి, వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బందిని అవసరం మేరకు నియమించుకోవాలని డీఎంఅండ్హెచ్ఓకు సూచించారు. మందులు, ఎక్విప్మెంట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో ఆస్పత్రులకు వచ్చే రోగులు శానిటైజర్ వినియోగించడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీఎం అండ్ హెచ్ఓ వీరాంజనేయులు, ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల, డేటా మేనేజర్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త బస్తీ దవఖానాలు ఇవే..

జిల్లాకు కొత్తగా 15 బస్తీ దవఖానాలు మంజూరయ్యాయి. వీటిలో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్లాపూర్ వార్డులోని అశోక్ నగర్, సింగం చెరువు, వివేకానంద నగర్, ఏఎస్‌ రావు నగర్ వార్డులోని కమలానగర్ కమ్యూనిటీ హాల్, చర్లపల్లి వార్డులోని సాయిరాం నగర్ కమ్యూనిటీ హాల్, కుషాయిగూడ మహిళా మండలి భవన్, మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో సుభాష్ నగర్ వార్డులోని అంబేద్కర్ నగర్ కొత్తబస్తీ, మచ్చ బొల్లారం వార్డులోని అరుంధతీ కమ్యూనిటీ హాల్, తుర్కపల్లి మోడల్ మార్కెట్, కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్భుల్లాపూర్ వార్డులోని ద్వారకానగర్, రంగారెడ్డి నగర్ వార్డులోని నందన నగర్, జీడిమెట్ల వార్డులోని రంగారెడ్డి నగర్ (కుత్భుల్లాపూర్), చింతల్ వార్డులోని భగత్ సింగ్ నగర్, వివేకానందా నగర్ కాలనీ వార్డలోని వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్, కూకట్ పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్ బీ కాలనీలో ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed