‘వరవరరావును వెంటనే ఆసుపత్రికి తరలించండి’

by Shamantha N |
‘వరవరరావును వెంటనే ఆసుపత్రికి తరలించండి’
X

దిశ, న్యూస్ బ్యూరో: తీవ్ర అనారోగ్యంతో మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న పౌరహక్కుల సంఘం నేత వరవరరావును తక్షణమే ఆసుపత్రికి తరలించాలని 14 మంది ఎంపీలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తెలంగాణకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులతో పాటు తమిళనాడుకు చెందిన కనిమొళి, కేరళకు చెందిన రాగేశ్, దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా అధినేత తోల్ తిరుమావలవన్ (ఎంపీ కూడా) తదితర మొత్తం 14 మంది ఎంపీలు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎనిమిది పదుల వయసులో గుండె సంబంధ వ్యాధితో వరవరరావు బాధపడుతున్నారని, గత నెల చివరి వారంలో స్పృహతప్పి పడిపోతే జేజే ఆసుపత్రిలో చికిత్స అందించారని, ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్నా జైల్లోనే ఉంచారని, ఆయన ప్రాణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఎంపీలు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆరునెలల క్రితం పూణెలోని జైళ్ళలో ఉన్న సమయంలో అల్సర్ సమస్యకు కొలనోస్కోపీ చేయించాలని వైద్యులు సిఫారసు చేసినా ఇప్పటికీ ఆ పరీక్ష నిర్వహించలేదని, ప్రస్తుతం జైల్లో అందుతున్న వైద్యం ఆయన అనారోగ్య సమస్యకు సరిపోవడంలేదన్నారు.

ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇటీవల ఫోన్‌లో మాట్లాడేటప్పుడు మాట సరిగా రాని స్థితిలో ఉన్నట్లు తమ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో విస్తృతంగా ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వేర్వేరు జైళ్ళలో ఉన్న పలువురికి పాజిటివ్ వచ్చినట్టు వార్తలు తెలియజేస్తున్నాయని, ఇప్పటికీ నలుగురు ఆ కారణంగానే చనిపోయినట్టు తెలిసిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వరవరరావును వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆ లేఖలో మహారాష్ట్ర సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed