అప్పుడే పదమూడేళ్లా?.. నమ్మలేకపోతున్నా! : చెర్రీ

by Shyam |
అప్పుడే పదమూడేళ్లా?.. నమ్మలేకపోతున్నా! : చెర్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తేజ్.. టాలీవుడ్ ‘చిరుత’లా దూసుకొచ్చాడు. ‘మగధీర’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసి తండ్రికి తగ్గ తనయుడిగా, మెగా పవర్ స్టార్‌గా అవతరించాడు. ‘చావులో అయినా తోడురా భైరవా’ అన్న ప్రియురాలు కోసం ప్రాణాన్ని త్యాగం చేసేందుకు వెనుకాడని ప్రేమికుడిగా, సైన్యాధిపతిగా రెండో సినిమాలోనే నటనలో పరిపూర్ణత చూపించిన చరణ్.. ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది అంటూ ‘ఆరెంజ్’ సినిమాలో లవర్ బాయ్‌గా యాక్టింగ్‌లో మరో యాంగిల్ చూపించాడు. ‘రచ్చ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసి.. టాలీవుడ్ యంగ్ జనరేషన్ ‘నాయకుడు’ అనిపించుకున్నాడు. ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చెర్రీ ‘గోవిందుడు అందరివాడేలే’ అంటూ సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ‘రంగస్థలం’ చిట్టిబాబుగా, సౌండ్ ఇంజినీర్‌గా కెరియర్‌లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన చిరు తనయుడు.. అల్లూరి సీతారామరాజుగా ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రంలో అమేజింగ్ లుక్‌తో అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాడు. జక్కన్న చెక్కిన అల్లూరిగా మరో క్రూషియల్ అండ్ ఇంటెన్స్ రోల్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. కాగా, చరణ్ సినీరంగంలోకి అడుగుపెట్టి 13 ఏళ్లు అయిన సందర్భంగా తనకు సపోర్ట్ చేసిన దర్శకులు, నిర్మాతలు, ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్ పెట్టారు.

ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 సంవత్సరాలు అయిందంటే నమ్మలేకపోతున్నానన్న చరణ్.. కెరియర్‌లో గ్రేట్ సక్సెస్‌తో పాటు కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయని, కానీ అన్నిటినీ ఆస్వాదించానని చెప్పాడు. అన్ని పరిస్థితుల్లోనూ తనకు సపోర్ట్‌గా నిలిచిన అభిమానులకు ధన్యావాదాలు తెలిపాడు. ‘మీరు అందిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను.. మిమ్మల్ని మెప్పించేందుకు మరింత హార్డ్ వర్క్ చేస్తాను’ అని ప్రామిస్ చేశారు.

తొలి సినిమా ‘చిరుత’ షూటింగ్ రోజులు నిన్న జరిగినట్లే అనిపిస్తోందన్న చరణ్.. డైరెక్టర్ పూరీ జగన్నాధ్, వైజయంతి మూవీస్, హీరోయిన్ నేహా శర్మ, సంగీత దర్శకులు మణిశర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ పూరీ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ అందించారు చెర్రీ.

Advertisement

Next Story