సింధూరి చేతిలో.. మాస్క్ మణిహారం

by Shyam |
సింధూరి చేతిలో.. మాస్క్ మణిహారం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రజలను కలవరపెడుతోంది. ఈ సమయంలో మాస్క్ తప్పనిసరని వైద్యులతో పాటు ప్రభుత్వం కూడా సూచిస్తోంది. అయినా చాలా మంది మాస్క్‌లు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కానీ ఓ పదేళ్ల చిన్నారి మాత్రం.. మాస్క్ మనల్ని రక్షిస్తుందని నమ్మింది. అందుకే తనకున్న ఒక్క చేతితోనే మాస్క్‌లు కుట్టి అవసరమైన వారికందిస్తూ శభాష్ అనిపించుకుంటోంది.

ఉడిపికి చెందిన సింధూరికి పుట్టుకతోనే ఓ చేయి లేదు. మౌంట్ రోసరీ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. కాగా ప్రజల కోసం ఆ స్కూల్‌కు చెందిన స్కౌట్ అండ్ గైడ్స్ డిపార్ట్‌మెంట్ లక్ష మాస్కులను కుట్టి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా సింధూరి 15 మాస్కులను ఒంటి చేత్తో తయారు చేసింది. వీటిని పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేశారు.

మొదట్లో ఒంటి చేత్తో కుట్టేందుకు ఇబ్బంది పడ్డానని, కానీ అమ్మ సాయంతో పూర్తి చేయగలిగానని సింధూరి తెలిపింది. మాస్క్‌లు కుట్టి అందజేసినందుకు అందరూ తనను అభినందిస్తున్నారని ఆ చిన్నారి ఆనందం వ్యక్తం చేసింది.

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా.. ఎదుటి వారికి సాయం చేసేందుకు తటపటాయించే నేటి సమాజంలో.. ఒంటిచేత్తో మరొకరి సాయం చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్న సింధూరి.. నిజంగా ఈ పుడమికి సింధూరమే.

Advertisement

Next Story