వే టు.. ప్రైవేట్

by Shamantha N |
వే టు.. ప్రైవేట్
X

ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణకు కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లలో ప్రభుత్వ వాటాలను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. ఐడీబీఐలో మిగిలి ఉన్న ప్రభుత్వ వాటా మొత్తాన్ని స్టాక్ ఎక్స్చేంజీ ద్వారా విక్రయించనున్నట్టు తెలిపారు. అలాగే, దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ నుంచి కొంతవాటాను అమ్మేందుకు ప్రతిపాదన చేశారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో) ద్వారా ఎల్ఐసీలోని కొన్ని వాటాలను విక్రయించనున్నట్టు తెలిపారు. అయితే, ఏ మేరకు విక్రయిస్తారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.

ప్రభుత్వ వైమానిక సంస్థ ఎయిరిండియాలో వంద శాతం వాటాలను అమ్మేందుకు సర్కారు గతంలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కానీ, కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో ఎయిరిండియా అమ్మకం వాయిదా పడింది. తాజాగా, మరిన్ని సడలింపులతో అమ్మకానికి కేంద్రం సిద్ధమైంది. ఎయిరిండియాతోపాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), భారతీయ కంటెయినర్ నిగమ్(కాంకార్), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌సీఐ)లలోనూ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ప్రతిపాదనలు చేసిన విషయం విదితమే.

భారీ టార్గెట్.. రూ.2.1 లక్షల కోట్ల ఉపసంహరణ

పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం భారీ లక్ష్యాన్ని ప్రకటించుకుంది. 2019-20 సంవత్సరానికిగాను ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) నుంచి రూ. 1.05 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కారు టార్గెట్ పెట్టుకుంది. కానీ, సర్కారు అనుకున్నట్టుగా ఈ ప్రక్రియ సాగలేదు. ఎయిరిండియా లాంటి కొన్ని సంస్థల వాటాల విక్రయాల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సర్కారు పెట్టుకున్న రూ. 1.05 లక్షల కోట్ల డైవెస్ట్‌మెంట్ టార్గెట్‌లో రూ.50 వేల కోట్లు వెనకబడొచ్చని విశ్లేషణలు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతనెల వరకు వాటాల విక్రయం ద్వారా సర్కారు రూ. 18,095 కోట్లను సమకూర్చుకోగలిగింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.05 లక్షల కోట్ల నుంచి 1.50 లక్షల కోట్ల వరకు పెంచవచ్చని అంచనాలు వచ్చాయి. కానీ, కేంద్రం ఈ టార్గెట్‌ను ఏకంగా 2.10 లక్షల కోట్లకు పెంచింది. ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్ కావడం గమనార్హం. ఈ టార్గెట్ కోసం ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వాటాల అమ్మకాల ద్వారా రూ. 90 వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.2 లక్షల కోట్లను ఆర్జించాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story