మేము గెలిచినా ఓడినట్లే..!

by Sridhar Babu |
మేము గెలిచినా ఓడినట్లే..!
X

దిశ ప్రతినిధి, ఖ‌మ్మం: నిధుల్లేవ్‌.. ప‌నుల్లేవ్‌.. చిత్‌.. అస‌లు గెలిచే లాభం లేద్‌.. గెలిచి.. ఓడిన‌ట్లయింది.. ఏడాద‌యినా చిల్లిగ‌వ్వ కేటాయింపుల్లేవ్‌.. జ‌నాల‌కు మొహం చూప‌లేకుపోతున్నా.. మా ఊరికి కూడా ఏం చేయ‌లే.. ఇజ్జత్‌పోతాంది. ఓ ఓసారి అనిపిస్తంది ఓడిపోయి ఇంట్ల గూసున్న మంచిగ‌నే ఉండ‌ని.. ఇప్పుడు గెలిచి జ‌నాల‌కు స‌మాధానం చెప్పలేక‌పోతున్నా.. బ‌తికుంటే స‌ర్పంచ్‌గానైనా పోటీ చేస్తా గాని.. జెడ్పీటీసీగా మాత్రం బ‌రిలోకి దిగ‌ను. ఇదీ ఓ జెడ్పీటీసీ ఆవేద‌న‌. 2014 నుంచి జిల్లా ప‌రిష‌త్ వ్యవ‌స్థల‌ను నిర్వీర్యం చేస్తూ వ‌స్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుల విష‌యంలో కోత పెడుతూ వ‌చ్చింది. ప‌రిపాల‌న‌లో ప‌రిష‌త్‌ల భాగ‌స్వామ్యం చాలా ప‌రిమిత‌మైంది. ఇప్పుడైతే నామమాత్రమై పోయింద‌నే చెప్పాలి. రాజ‌కీయ నిరుద్యోగిత‌ను తీర్చడానికి త‌ప్పితే ప‌రిష‌త్‌ల వ్యవ‌స్థ ఎందుకు ప‌నికిరాద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

నిధుల కోత‌లు..

జిల్లా పరిషత్‌లకు వచ్చే నిధుల కోతతో సభ్యుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గ‌తంలో అయితే బీఆర్‌జీఎస్, సిన‌రేజి, సెస్సు, స్టాంపు డ్యూటీ, అద్దె భ‌వ‌నాలు, వేలం పాట‌ల‌తో పాటు ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇత‌ర‌త్రా మార్గాల ద్వారా జెడ్పీల‌కు ఆదాయం స‌మ‌కూరేది. వీటికి తోడు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేస్తూ వ‌చ్చేది. ఈ కార‌ణంగా ప్రభుత్వ ప‌రిపాల‌న‌లో, అభివృద్ధి అంశాల్లో జెడ్పీటీసీల‌కు భాగ‌స్వామ్యం ద‌క్కేంది. ఇక జిల్లా పరిషత్‌లకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు బీఆర్‌జీఎఫ్‌ వంటి నిధులను 2015-16 నుంచి ఆపేసింది. 13వ ఆర్థిక సంఘం ఏడాదికి అప్పటి ఉమ్మడి జిల్లా జ‌డ్పీల‌కు రూ.100 కోట్లు కేటాయించేది. 14వ ఆర్థిక సంఘం నిధుల‌ను నేరుగా పంచాయతీలకే కేటాయించాలని నిర్ణయించి అమ‌లు చేస్తోంది. ఈ కార‌ణాల‌న్నింటి చేత జిల్లా పరిషత్‌ల‌కు నిధులు తగ్గాయి.

స్థానిక సంస్థలకు స్టాంపుడ్యూటీలో వాటాను 3 నుంచి 1.5 శాతానికి తగ్గించారు. గనులు, ఖనిజాల ద్వారా సమకూరాల్సిన సినరేజి ఆదాయం జిల్లా పరిషత్‌లకు కేటాయించడం లేదు. జడ్పీ కార్యాలయాల్లో కరెంటు, ఫోన్‌, వాహన బిల్లులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా పరిషత్‌లకు గ్రామాల్లో నిర్దేశించిన అభివృద్ధి పనులు అనేకం ఉంటాయి. అందులో ప్రధానంగా పాఠశాల భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌక‌ర్యాల‌ కల్పన, సీసీ రోడ్ల నిర్మాణం, అనుసంధానం చేసే రోడ్ల నిర్మాణం, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, వీధి లైట్ల ఏర్పాటు, కమ్యూనిటీభవనాలు, మహిళా భవనాలు, పంచాయతీల భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మా ణం వంటి అనేక ప‌నులు చేయ‌డానికి అవ‌కాశం ఉంది నిధుల కేటాయింపు లేక‌పోవ‌డంతో మూడు నెల‌ల‌కొసారి జెడ్పీ స‌మావేశాల్లో స‌మీక్షలు.. మిన‌హా సాధించేది ఏం లేద‌న్న నిర్వేదాన్ని జెడ్పీటీసీలు వ్యక్తం చేస్తున్నారు.

హోదాలో ఉన్నందున..

ప్రజ‌ల మ‌న‌సు గెలిచి ప్రజాప్రతినిధిగా ఎన్ని కైనా తాము ప్రభుత్వ మ‌న‌స్సు గెల‌వ‌లేక‌పోతున్నామ‌ని జెడ్పీటీసీలు ఆవేద‌న చెందుతున్నారు. ఎన్నికైన వారి ప‌రిస్థితి మింగ‌లేక.. కక్కలేక.. అన్న చందంగా మారింది. మండల అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం అవుదామని భావించిన పలువురు ప్రజాక్షేత్రంలో పోటీపడి జడ్పీటీసీలుగా గెలిచారు. ఇంతచేసి గెలిచినా ఏడాది కాలంగా నిధుల కేటాయింపు లేక‌పోవ‌డంతో ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నామన్న భావన ప్రతీ జ‌డ్పీటీసీలోనూ వ్యక్తమ‌వుతోంది.

ఎమ్మె ల్యేనో, మంత్రి కార్యక్రమానికి వెళ్లడం త‌ప్పా.. సొంతంగా త‌మ‌కు ద‌క్కిన నిధుల‌తో త‌ట్టెడు మ‌ట్టి కూడా పోయ‌లేని ద‌య‌నీయ రాజ‌కీయ ప‌రిస్థితిలో.. ప‌రిపాల‌న హోదాలో ఉన్నందుకు బాధ‌ప‌డుతున్నామ‌ని ఆవేద‌న చెందుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న కనీస సమ స్య పరిష్కారానికి కూడా నిధులు కేటాయించలేకపో తున్నా మ‌ని, తమ సొంత గ్రామానికి కూడా ఏం చేసుకోలేని పరిస్థితిలో జడ్పీటీసీలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల సమ యంలో ఎంపికైనవారు పలు గ్రామాల్లో హామీలు ఇవ్వగా, ఇప్పటికీ నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టకపోలేకపోతున్నారు. దీంతో ప్రజ‌ల‌కు మొహం చూప‌డానికి ఇబ్బంది ప‌డుతున్నారు.

ఏడాది నుంచి రూ.5ల‌క్షలు కేటాయింపు..

జెడ్పీటీసీల‌పై రాష్ట్ర ప్రభుత్వం వివ‌క్షతో వ్యవ‌ హ‌రిస్తోంది. జిల్లా ప‌రిష‌త్‌ల వ్యవ‌స్తను నిర్వీ ర్యం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నట్లుగా అర్థమ‌వుతోంది. గ‌తంలో సీఎం చేసిన ప్ర క‌ ట‌న‌కు క‌ట్టుబ‌డి ఉంటే బాగుటుంది. ఎలాం టి నిధుల కేటాయింపు జ‌ర‌గ‌క‌పోవ‌డం త‌మ ప్రాదేశిక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి అభివృ ద్ధి చేయ‌లేక‌పోతున్నాం. ఎన్నుకున్న ప్రజ‌ల‌కు స‌మాధానం చెప్పలేక‌పోతున్నాం. అధికార పార్టీ జ‌డ్పీటీసీల్లోనూ తీవ్ర ఆవేద‌న వ్యక్తమ‌వుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా నిధుల కేటాయింపు చేసి ప‌రిపాల‌న‌లో భాగ‌స్వామ్యం పెంపొందించాలి.

– సుధీర్‌బాబు, బోనకల్ జెడ్పీటీసీ

Advertisement

Next Story

Most Viewed