కర్నూలు వైసీపీలో ఆధిపత్య పోరు.. కొట్టుకున్న నేతలు

by srinivas |
byreddy vs aurther
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీలో అంతర్గత వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు, యువనేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గీయులు మధ్య ఉన్న ఆధిపత్యపోరు తారా స్థాయికి చేరింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 12వ వార్డులో సిద్దార్థరెడ్డి బలపరిచిన అభ్యర్థి వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. రెబల్ అభ్యర్థి తరపున వార్డు వలంటీర్ ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నాడని ప్రచారం జరిగింది.

దీంతో రెబల్ అభ్యర్థి తరపున ఓటరు స్లిప్పులు ఎలా పంపిణీ చేస్తున్నావని వార్డు వలంటీర్‌ను ఎమ్మెల్యే వర్గీయులు ప్రశ్నించారు. దీంతో వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాల కార్యకర్తలు కొట్టుకున్నారు. ఇకపోతే నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి వరకు ఈ వివాదం చేరింది. గతంలో వర్గపోరు భరించలేక ఎమ్మెల్యే ఆర్థర్ రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. దాంతో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బట్టబయలైంది. ఇలా వర్గపోరు వల్ల పార్టీకే నష్టమని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు కలిసి పనిచేస్తే వైసీపీ విజయఢంకా మోగిస్తుందని వారు సూచిస్తున్నారు.

Advertisement

Next Story