వైఎస్ వివేకా హత్యకేసు.. ఆ నలుగురిపైనే అనుమానం?

by srinivas |
YS Viveka murder
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. వరుసగా ఎనిమిది రోజుల నుంచి విచారణ చేస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకా వద్ద పనిచేసిన సిబ్బంది, సన్నిహితులపైనే సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నలుగురిపై సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్‌ ఇదయతుల్లాతో పాటు కిరణ్‌, సునీల్‌లను సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. సునీల్ కుమార్ యాదవ్‌ వివేకాకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని పులివెందులలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు పులివెందులోని అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.

దీంతో పాటు ఆదివారం వివేకా ఇంటిని సైతం మూడు గంటల పాటు పరిశీలించిన అధికారులు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సోమవారం పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్తలు కిరణ్‌, సునీల్‌ కుమార్‌ యాదవ్‌ల తండ్రి కృష్ణయ్యను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

Next Story