వాటిపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా.. ఎంపీ అర్వింద్‌పై షర్మిల పైర్

by Shyam |   ( Updated:2023-12-17 16:41:40.0  )
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి గడపకు పూసే పసుపు, నోటిని తీపి చేసే చెరుకును అందించే నిజామాబాద్ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నాయని, అందుకు ఇటీవల భైంసాలో జరిగిన అల్లర్లే సాక్ష్యమని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మత కల్లోలాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల అభిమానులు, నాయకులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పసుపు ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిజామాబాద్ ఉందని, బీజేపీ ఎంపీగా తనను గెలిపిస్తే ఐదు రోజులకే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని హామీలివ్వడమే కాక బాండ్ పేపర్ కూడా రాసిచ్చి అర్వింద్ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

పసుపు బోర్డు బదులు స్పైస్ బోర్డుతో సరిపెట్టుకోవాలని కేంద్రం సూచించడంపై ఆమె మండిపడ్డారు. ఎన్ని ఉద్యమాలు చేసినా నేటికీ పసుపు రైతుల కష్టాలు తీరలేదన్నారు. రాష్ట్రంలో కౌలు రైతు తన కుటుంబసభ్యులు నలుగురితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడని, రైతులు చస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదని ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగజ్ నగర్ పేపర్ మిల్లు ఎప్పుడు తెరుస్తారని, కార్మికుల కష్టాలు ఎన్నడు తీరుతాయని ఆమె నిలదీశారు. జల్, జమీన్, జంగల్ పేరుతో నిజాంకి చుక్కలు చూపించిన కొమురం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరాం పుట్టిన గడ్డ ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపింది తండ్రి వైస్సార్ అని షర్మిల గుర్తుచేశారు. ఆయన మరణంతో ముందడుగు పడలేదని షర్మిల తెలిపారు. సమస్యలన్నీ తీరాలంటే రాజన్న సంక్షేమ పాలన తిరిగి రావాలని, అందుకు అందరి సహకారం కావాలని ఆమె కోరింది.

Advertisement

Next Story

Most Viewed