జాతీయ రహదారిపై డీసీఎంలో అన్నను చంపిన తమ్ముడు

by Sumithra |   ( Updated:2021-10-31 01:00:21.0  )
Brother-Died1
X

దిశ, రాజేంద్రనగర్: ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. కత్తితో తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి గండిగూడ వద్ద లారీలో ఓ వ్యక్తిని హత్య చేశారని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుడు లారీ డ్రైవర్ గోనికాడి యాదగిరి (29)గా గుర్తించామని, వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన గోనికాడి యాదగిరి, శ్రీనివాసులు.. అన్నదమ్ములు. వీరు ఆరంజ్ కార్గో క్యారియర్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఇటీవల అన్న యాదగిరి గ్రామంలో సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. దాని విషయంలో తనకు వాటా ఇవ్వాలని తమ్ముడు శ్రీనివాసులు తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.

శనివారం వీరిద్దరితో పాటు మరో ముగ్గురు కలిసి కొరియర్ లోడుతో కొంపల్లి నుంచి చెన్నైకి బయలుదేరారు. శనివారం రాత్రి గండిగూడ వద్దకు రాగానే డీసీఎంలోనే సోదరులిద్దరూ డబ్బుల విషయంలో గొడవపడి కత్తితో అన్నపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని, తమ్ముడు శ్రీనివాసులుతోపాటు లారీలో ఉన్న మరో ముగ్గురుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story