మూడు రాజధానులపై మనసులో మాట బయటపెట్టిన వైసీపీ నేత

by srinivas |
మూడు రాజధానులపై మనసులో మాట బయటపెట్టిన వైసీపీ నేత
X

దిశ, ఏపీ బ్యూరో : మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదేలేదు అని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో మంగళవారం జగనన్న సంపూర్ణ గృహహక్కు కార్యక్రమంలో భాగంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ విశాఖలో, హైకోర్టు కర్నూల్ లో ఏర్పాటు చేయక తప్పదని, అలాగే అమరావతి కూడా రాజధానిగా ఉంటుందని మంత్రి నాని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం రాజధాని వికేంద్రీకరణ తథ్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అందరిదీ అంటున్న వాళ్ళు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులుకెళ్లి ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రశ్నించారు.

అమరావతి పరిరక్షణ పేరుతో పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే.. పరమేశ్వరుడు ఉండే అమరావతిని ఆయన ఆశీర్వదిస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టిన రాజధాని అమరావతి అని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెందిన 30వేల ఎకరాల భూమిలో అమరావతి ఏర్పాటు చేయాలని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని కొడాలి నాని సవాల్ విసిరారు. తన సామాజిక వర్గానికి చెందిన వారికి లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని మంత్రి కొడాలి నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story