WTC FINAL: భారత్ తడబాటు.. టీమ్ ఇండియా 146/3

by Shyam |
WTC FINAL: భారత్ తడబాటు.. టీమ్ ఇండియా 146/3
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ తొలి సారి నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆటంకాలు తప్పడం లేదు. తొలి రోజు వర్షం కారణంగా ఆట పూర్తిగా రద్దయ్యింది. దీంతో రెండో రోజైన శనివారం ఆటను అరగంట ముందుగానే ప్రారంభించారు. రెండు సెషన్లు సక్రమంగానే జరిగినా టీ విరామం తర్వాత వెలుతురు సరిగా లేని కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది.

సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా ఇండియా,న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి రోజు ఆట రద్దు కావడంతో రెండో రోజు అరగంట ముందుగా ఆటను ప్రారంభించారు. టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్‌గిల్ మొదటి నుంచే న్యూజీలాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో కివీస్ పేసర్లను ఎదుర్కుంటూ పరుగులు రాబట్టారు. రోహిత్, గిల్ తమ ఫామ్‌ను కొనసాగిస్తూ తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ తన సహజ శైలిలో బౌండరీలు బాదుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే కేల్ జేమిసన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (34) టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(28) కీపర్ వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంచ్ విరామ సమయానికి టీమ్ ఇండియా 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.

ఇక రెండో సెషన్‌ ప్రారంభంలోనే భారత జట్టు కీలకమైన పుజారా వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజార (8) ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు చాలా నెమ్మదిగా ఆడారు. ముందు క్రీజులో పాతుకొని పోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. వీరిద్దరూ క్రీజులో కుదురు కున్నాక నెమ్మదిగా పరుగులు చేయడం మొదలు పెట్టారు. విరాట్ కోహ్లీ తన సహజ శైలికి భిన్నంగా బౌండరీల కంటే సింగిల్స్, డబుల్స్ తీయడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న రహానే కూడా నెమ్మదిగానే ఆడినా మధ్యలో బౌండరీలు కొడుతూ పరుగులు రాబట్టాడు. కోహ్లీ, రహానే వికెట్ పారేసుకోకుండా ఆడటంతో రెండో సెషన్‌లో 32 పరుగులే లభించాయి.

టీ విరామం అనంతరం వెలుతురు సరిగా లేకపోవడంతో వెంటనే ఆటను ప్రారంభించలేదు. వెలుతురు వచ్చిన తర్వాత ఆటను ప్రారంభించారు. కోహ్లీ, రహానే అదే రీతిలో వికెట్ పడకుండా క్రీడులోనే పాతుకొని పోయారు. వెలుతురు వచ్చిన తర్వాత కేవలం 11.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. కోహ్లీ, రహానే కలసి నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. అయితే భారత జట్టు 146/3 స్కోర్ వద్ద ఉన్నప్పుడు అంపైర్లు వెలుతురు లేదని మరోసారి ఆటను నిలిపి వేశారు. ఆ తర్వాత ఎంత సేపటికీ ఆట ఆడే అనుకూల పరిస్థితులు లేకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. కోహ్లీ 44, రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. జేమిసన్, బౌల్ట్, వాగ్నర్ తలా ఒక వికెట్ తీశారు.

తొలి రోజు ఆట రద్దైన కారణంగా మిగిలిన నాలుగు రోజులు అరగంట ముందుగానే ఆటను ప్రారంభించడంతో పాటు రోజుకు 98 ఓవర్ల పాటు వేయాలని రిఫరీ నిబంధన పెట్టాడు. అయితే రెండో రోజు వెలుతురు లేమి కారణంగా కేవలం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమయ్యింది. తొలి, రెండవ రోజు వేస్ట్ అయిన సమయాన్ని రిజర్వ్ డే రోజు ఉపయోగించుకునే అవకాశం ఉన్నది.

స్కోర్ బోర్డు :

ఇండియా తొలి ఇన్నింగ్స్

రోహిత్ శర్మ (సి) టిమ్ సౌథీ (బి) కేల్ జేమిసన్ 34, శుభ్‌మన్ గిల్ (సి) బీజే వాట్లింగ్ (బి) నీల్ వాగ్నర్ 28, చతేశ్వర్ పుజార (ఎల్బీడబ్ల్యూ)(బి) ట్రెంట్ బౌల్ట్ 8, విరాట్ కోహ్లీ 44 బ్యాటింగ్, అజింక్య రహానే 29 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (66.4 ఓవర్లు) 146/3

వికెట్ల పతనం : 1-62, 2-63, 3-88

బౌలింగ్ : టిమ్ సౌథీ (17-4-47-0), ట్రెంట్ బౌల్ట్ (12.4-2-31-1), కేల్ జేమిసన్ (14-9-14-1), కోలిన్ డి గ్రాండ్‌హోమ్ (11-6-23-0), నీల్ వాగ్నర్ (10-3-28-1)

Advertisement

Next Story