23 శాతం పెరిగిన కూరగాయల ధరలు

by Harish |
23 శాతం పెరిగిన కూరగాయల ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 1.48 శాతంగా నమోదయ్యింది. ఇది ఎనిమిది నెలల గరిష్టస్థాయి. నెలవారీ ప్రాతిపదికన డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలో పెరిగింది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.32 శాతంగా ఉండగా, గతేడాది ఇదే నెలలో 0.33 శాతంగా ఉంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఇటీవల ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా తెరుచుకున్నాయి.

ఈ క్రమంలో లాక్‌డౌన్ తర్వాత ఉత్పత్తులు ఖరీదైనవిగా మారాయి. అందుకే ద్రవ్యోల్బణం 0.16 శాతం పెరిగింది. సూచీలో దాదాపు 14 శాతం వెయిటేజ్‌ ఉన్న ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ ధర భారీగా పెరిగింది. కూరగాయల ధరలు 22.51 శాతం పెరిగాయి. అలాగే, మాంసం, చేపల ధరలు 18.70 శాతం, గుడ్లు 22.81 శాతం పెరిగాయి. దీనికి ముందు హోల్‌సేల్ ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలలుగా ప్రతికూలంగా ఉంది. ఏప్రిల్‌లో 1.57 శాతం, మే 3.37 శాతం, జూన్‌లో 1.81 శాతం, జులైలో 0.25 శాతం ప్రతికూలంగా నమోదయ్యాయి. మొత్తం సూచీలో ప్రైమరీ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 1.40 శాతం పెరిగింది. ఇందులో ఫుడ్ ఆర్టికల్స్ 1.37 శాతం, నాన్‌ఫుడ్ ఆర్టికల్స్ 2.37 శాతం పెరిగాయి.

ముడి పెట్రోలియం, సహజ వాయువు ధరల్లో మార్పులేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంధన, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 0.11 శాతం పెరిగింది. అక్టోబర్ నెలకు సంబంధించి విద్యుత్ ధరలు 4.26 శాతం పెరిగాయి. ఖనిజ నూనె ధరలు 1.93 శాతం తగ్గాయి. బొగ్గు ధరల్లో మార్పులేదు. తయారీ ఉత్పత్తి సూచీ అక్టోబర్‌లో 0.42 శాతం పెరిగింది. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా, ఆర్‌బీఐలో కొత్తగా ఏర్పడిన ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) అక్టోబర్‌లో కీలక రుణ రెపో రేటును 4 శాతాన్ని మార్చలేదు.

Advertisement

Next Story