ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘనంగా యోగా వేడుకలు

by Harish |
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘనంగా యోగా వేడుకలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అనేక నగరాల్లోని పార్కులు, రోడ్లు, పాఠశాలల్లో యోగా వేడుకలను నిర్వహిస్తూ, అవగాహన కల్పించారు. శుక్రవారం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో వేలాది మంది ఒకేసారి ఆసనాలు వేశారు. టెల్ అవీవ్‌లో వందలాది మంది యోగా ఆసనాలను ప్రదర్శించారు, అదే సమయంలో అక్టోబర్ 7 దాడి తర్వాత హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ వేడుకలో పాల్గొన్న వారు తమ యోగా మ్యాట్‌లకు బందీల చిత్రాలను అతికించి, వారు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలని డిమాండ్ చేస్తూ మౌన నిరసన చేపట్టారు.


ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆ దేశ సంస్కృతి, క్రీడల మంత్రిత్వ శాఖతో కలిసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో దాదాపు 300 మందికి పైగా పాల్గొన్నారు. ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి యోగా వేడుకలను షేర్ చేసింది. షాంఘైలోని భారత కాన్సులేట్ చైనాలోని అతి పెద్ద బుద్ధ విగ్రహాలలో ఒకటైన లింగ్షాన్ బుద్ధుని వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది.


నేపాల్‌లో, భారత రాయబార కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లలో యోగా సెషన్‌లను నిర్వహించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో, ప్రసిద్ధ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు.



Advertisement

Next Story

Most Viewed