హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యం: ఆ ప్రతిపాదనను తిరస్కరించిన ఇజ్రాయెల్

by samatah |
హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యం:  ఆ ప్రతిపాదనను తిరస్కరించిన ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. యుద్ధంలో విజయం సాధించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంపూర్ణంగా గెలిచినప్పుడే ఇజ్రాయెల్ భద్రతకు హామీ లభిస్తుందని తెలిపారు. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగబోదని, విజయానికి అతి చేరువలో ఉన్నామని చెప్పారు. హమాస్ డిమాండ్లు విచిత్రంగా ఉన్నాయని, వాటికి ఒప్పుకోబోమని వెల్లడించారు. హమాస్‌ను అంతం చేయడం తప్ప వేరే పరిష్కారమే లేదని తేల్చి చెప్పారు. వారిని నాశనం చేసే వరకు పోరాడుతూనే ఉంటామని తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో నెతన్యాహుతో సమావేశమయ్యారు. అనంతరం బెంజమిన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా, ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివరకు పాలస్తీనియన్లను మూడింట రెండు వంతుల చిన్న తీరప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

హమాస్ ఢీల్ ఇదే

హమాస్ మూడు దశల్లో మొత్తం 135 రోజుల కాల్పుల విరమణ కోరింది. దీని తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని పేర్కొంది. మొదటి దశలో 45 రోజుల కాల్పుల విరమణ ఉంటుంది. ఈ టైంలో హమాస్ చెరలో ఉన్న 19 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న స్త్రీలు, పురుషులు అందరూ విడుదల చేయబడతారు. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ పాలస్తీనా మహిళలు, పిల్లలను రిలీజ్ చేస్తుంది. మిగిలిన ఖైదీలను రెండో, మూడో దశల్లో విడుదల చేస్తారు. మూడో దశ ముగిసేలోపు ఇజ్రాయెల్-హమాస్ ఒక ఒప్పందానికి రానున్నట్టు భావించారు. కాల్పుల విరమణ సమయంలో గాజాకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా చేస్తామని హమాస్ తెలిపింది. ఈ కాల్పుల విరమణకు రష్యా, టర్కీ, ఈజిప్ట్, ఖతార్ హామీదారులుగా ఉంటాయని పేర్కొంది. కానీ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. హమాస్ వద్ద ఇప్పటికీ 130 మందికి పైగా బందీలు ఉన్నారు. అయితే వారిలో 30 మందికి పైగా చనిపోయారని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed