Sheikh Hasina: హసీనాను అప్పగించండి.. భారత్‌కు బీఎన్పీ విజ్ఞప్తి

by vinod kumar |
Sheikh Hasina: హసీనాను అప్పగించండి.. భారత్‌కు బీఎన్పీ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) భారత్‌కు విజ్ఞప్తి చేసింది. హసీనాపై బంగ్లాదేశ్‌లో పలు కేసులు నమోదయ్యాయని తెలిపింది. వీటన్నింటిపై విచారణ జరిపేందుకు ఆమెను చట్టపరంగా బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరింది. ఈ మేరకు బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ ఢాకాలో మీడియాతో మాట్లాడారు. హసీనాకు ఆశ్రయం కల్పించడం ద్వారా భారత్ ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను కోల్పోతుందన్నారు.

‘మన పొరుగు దేశం హసీనాకు ఆశ్రయం కల్పించడం దురదృష్టకరం. అక్కడే ఉంటూ బంగ్లాదేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు హసీనా కుట్రలు చేస్తున్నారు. ఆమె చేసిన నేరాలపై విచారణ జరపాలని బంగ్లాదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. హసీనా ఫాసిస్ట్ పాలన బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని బలహీనపరిచింది. గత 15ఏళ్లుగా దేశ ప్రగతికి ఆటంకం కలిగించింది’ అని వ్యాఖ్యానించారు. 18 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని సంక్షోభంలో నెట్టివేసిందని తెలిపారు. అంతేగాక దేశంలోని అనేక సంస్థలు నాశనం చేసిందని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా పని చేస్తోందని కొనియాడారు.

కాగా, బంగ్లాదేశ్‌లోని రిజర్వేషన్ల పద్దతిపై చేపట్టిన ఆందోళనతో దేశం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం హసీనాపై సుమారు 31 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇందులో హత్య, కిడ్నాప్ లకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ జరపాలని బీఎన్పీ భావిస్తోంది.

Next Story

Most Viewed