Pangolin trafficking | భూమిపై అత్యంత అక్రమ రవాణా అవుతున్న జంతువు ఏదో తెలుసా?.. దాని ప్రత్యేకత ఏంటి?

by S Gopi |
Pangolin trafficking | భూమిపై అత్యంత అక్రమ రవాణా అవుతున్న జంతువు ఏదో తెలుసా?.. దాని ప్రత్యేకత ఏంటి?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో అరుదైన జీవుల్లో పాంగోలిన్ కూడా ఒకటి. మనుషులంటే ఎంతో భయం. బంతిలా చుట్టుకుంటుంది. చీమలు, చెద పురుగులే దీనికి ఆహారం. అలాంటి ఈ జీవిని వెంటాడి, వేటాడి చంపేస్తున్నారు. ఈ అరుదైన జంతువు గురించి తెలుసుకుందాం రండి.

పాంగోలిన్.. ఇదో అడవి జంతువు. ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణా అవుతున్న వాటిలో ఇది ప్రథమ స్థానంలో ఉంది.ఈ స్మగ్లింగ్‌కు కారణం చైనా, వియత్నాం. అక్కడ ఈ జంతువు చర్మం, మాంసంతో సాంప్రదాయ మందులు తయారుచేస్తున్నారు. పాము, బల్లిలా కనిపించే ఈ జీవి క్షీరదాల వర్గానికి చెందినది. దశాబ్దాలుగా ఇది ప్రపంచంలోని అన్ని దేశాల నుంచీ అక్రమ రవాణా అవుతోంది. దీనితో చేసే మందులను ధనవంతులు.. అధిక ధరకు కొంటారు.

దీనిని భారతదేశంలో అలుగు, ఆలుగు, సల్లూ పాము అని పిలుస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాంగోలిన్‌లు సుమారు 6 కోట్ల సంవత్సరాలుగా చీమల్ని మాత్రమే తింటూ జీవిస్తున్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల అక్రమ రవాణాలో 20 శాతం పాంగోలిన్‌‌లే ఉన్నాయి. సంప్రదాయక వైద్య విధానాల్లో(Traditional medicine) పాంగోలిన్ శరీరంపై ఉన్న పొలుసులను(scales) ఉపయోగిస్తారు. మరోవైపు.. పాంగోలిన్‌ల వేటను అనేక దేశాలు నిషేధించాయి. దీంతో.. పాంగోలిన్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ జంతువులు మనపై దాడి చెయ్యవు. మానవులకు హాని చెయ్యవు. కానీ ఇవి వేటగాళ్లకు సులభంగా దొరికిపోతాయి. వీటికి ప్రమాదం అనిపించినప్పుడు, తమ శరీరాన్ని బంతిలా తిప్పుకుంటాయి. పై ఆకారం మొత్తం చిప్పలే ఉండటం వల్ల శత్రు జంతువులు దీన్ని తినలేవు. కానీ వేటగాళ్లు.. బంతిలా చుట్టుకోగానే.. పట్టుకుపోతున్నారు.

పాంగోలిన్‌ను హిందీలో వజ్రషాల్క్ అని అంటారు. ఇది ఈమధ్య మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో కనిపించింది. ఇది ఖరీదైనది కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నారు. ఒక పాంగోలిన్ ధర రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీని కేజీ మాంసం రూ.30 వేలు పలుకుతోంది.

ముదురు-గోధుమ లేదా పసుపు-గోధుమ రంగు పాంగోలిన్ యొక్క అరుదైన జాతుల ఎముకలు, మాంసంతో... ఉబ్బసం నుంచి క్యాన్సర్ వరకు అనేక వ్యాధులకు మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వీటిని చైనాలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సెక్స్ కోరికలు పెంచే డ్రగ్స్ తయారీలోనూ వాడుతున్నట్లు చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed