మారని ఉత్తరకొరియా తీరు: మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

by samatah |
మారని ఉత్తరకొరియా తీరు: మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. దక్షిణ కొరియా తూర్పు తీరంలోని సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా సైత్యం సోమవారం వెల్లడించింది. తూర్పు సముద్రం మీదుగా క్షిపణిని ప్రయోగించినట్టు తెలిపింది. తాజా ప్రయోగాన్ని జపాన్ కోస్ట్ గార్డ్ సైతం ధ్రువీకరించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి సముద్రంలో పడిపోయినట్టు పేర్కొంది. దానిని స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా అంచనా వేసింది.

రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు పంపుతుందని అమెరికా, దక్షిణ కొరియాలు ఇటీవల పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో ఉపయోగించడానికి సుమారు 7000 కంటైనర్ల ఆయుధాలను పంపినట్టు తెలిపాయి. అయితే వాటిని మాస్కోకు పంపేముందు ఉత్తర కొరియా పరీక్షిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఐక్యరాజ్యసమితి నుంచి ఆంక్షలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరిస్తూ ఉత్తరకొరియా 2006 నుంచి రికార్డు స్థాయిలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. అలాగే ఈ ఏడాది దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా ఉత్తర కొరియా అభివర్ణించింది.

Advertisement

Next Story

Most Viewed