రఫా సరిహద్దులో పట్టు పెంచుకుంటున్న ఇజ్రాయెల్

by Disha Web Desk 17 |
రఫా సరిహద్దులో పట్టు పెంచుకుంటున్న ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికి ఇజ్రాయెల్ మాత్రం రఫా నగరంపై దాడి విషయంలో వెనక్కి తగ్గడం లేదు. సోమవారం నుంచి మొదలైన దాడుల కారణంగా 20 మంది హమాస్ తీవ్రవాదులు హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం నాటికి గాజా,ఈజిప్ట్ మధ్య ఉన్న రఫా సరిహద్దులో పాలస్తీనా వైపు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని సైన్యం తెలిపింది. ప్రస్తుతం అక్కడ దాగి ఉన్న ఉగ్రవాదుల కోసం అన్ని ఏరియాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు రఫాలో లక్ష్యాలకు చేరువగా వెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గాజా నగరానికి దక్షిణంగా ఉన్న క్రాసింగ్‌ను సాయుధ బ్రిగేడ్‌లో భాగమైన ఇజ్రాయెల్ ట్యాంకులు స్వాధీనం చేసుకున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారులు తెలిపారు. రఫాలో బాంబుల దాడుల కారణంగా అక్కడ మౌలిక సదుపాయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు ప్రారంభించడానికి తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయని పాలస్తీనియన్ క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ అన్నారు. దీంతో చాలా మంది పౌరులు రఫా నుంచి పారిపోయి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణ ప్రజలు తమ సామాన్లతో వాహనాలపై తరలిపోతున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Next Story