ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్: తోషాఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష

by samatah |
ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్: తోషాఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో రావల్పిండి కోర్టు మంగళవారం పదేళ్ల జైలు శిక్ష విధించగా..తాజాగా బుధవారం తోషాఖానా కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీని ప్రకారం..ఇమ్రాన్ పదేళ్లు ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టలేరు. అలాగే ఇమ్రాన్ దంపతులిద్దరికీ భారీ జరిమానా సైతం విధించారు. ఈ క్రమంలో ‘న్యాయవ్యవస్థ చరిత్రలో మరో విచారకరమైన రోజు’ అని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) తెలిపింది.

తోషాఖానా కేసు నేపథ్యం

ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సౌదీ యువరాజు డైమండ్ నెక్లెస్‌ను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీని ధర పాకిస్థానీ రూపాయల ప్రకారం సుమారు రూ.18కోట్లుగా ఉంటుంది. దీనిని లాహోర్‌లోని ఓ నగల వ్యాపారికి ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ అప్పటి పాక్ మంత్రి జుల్ఫీ బుఖారీ ద్వారా విక్రయించారు. దీంతో ఇమ్రాన్, ఆయన భార్యపై తోషాఖానా కేసు నమోదైంది. ఇందులో సౌదీ యువరాజు నుంచి బహుమతిగా పొందిన నెక్లెస్‌ను ఇద్దరూ అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన అకౌంటబిలిటీ కోర్టు వారిద్దరికీ శిక్ష ఖరారు చేసింది. అయితే పాక్ నిబంధనల ప్రకారం..అధ్యక్షుడు లేదా ఇతర పదవుల్లో ఉన్న వ్యక్తులు వారు అందుకున్న బహుమతుల వివరాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు అందించాలి.

Advertisement

Next Story