రేపు భారత్ బంద్

by Shamantha N |
రేపు భారత్ బంద్
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కార్మికులు గురువారం భారత్ బంద్ పాటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసిస్తూ పది కార్మిక సంఘాలు ఈ నిరసనకు పిలుపునిచ్చాయి. సుమారు 25 కోట్ల మంది శ్రామికులు భారత్ బంద్ పాటించే అవకాశమున్నట్టు అంచనా. నిర్మాణరంగ కార్మికులు, బీడీ వర్కర్లు, చిన్న వ్యాపారులు, ఇతర శ్రామికులూ రేపు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేయడానికి నిర్ణయించుకున్నారు. కొన్ని చోట్ల రాస్తారోకోలు చేపట్టనున్నారు. పలురాష్ట్రాల్లో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు బంద్ పాటించనున్నారు. ఆదాయ పన్ను చెల్లించని కుటుంబాలన్నింటికీ నెలకు రూ. 7,500 రూపాయల నగదు బదిలీ చేయాలని, అవసరార్థులకు పది కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

ఉపాధి హామీ పథకంలో పని దినాలను 200లకు పెంచాలని, పట్టణాలకూ ఉపాధి హామీని విస్తరించాలని కోరాయి. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, హింద్ మజ్దూర్ సభ, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్, ట్రేడ్ యూనియన్ కో ఆర్డినేషన్ సెంటర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వుమెన్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, లేబర్ ప్రొగ్రెసివ్ ఫెడరేషన్, యూనియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌లు సంయుక్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ నిరసనకు మద్దతునిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed