మార్చి త్రైమాసికంలో విప్రో లాభాలు 28 శాతం వృద్ధి!

by Harish |   ( Updated:2021-04-15 06:48:18.0  )
మార్చి త్రైమాసికంలో విప్రో లాభాలు 28 శాతం వృద్ధి!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో నికర లాభాలు 27.78 శాతం పెరిగి రూ. 2,972.3 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 2,326.1 కోట్ల లాభాలను ఆర్జించింది. త్రైమాసిక ప్రాతిపదికన 0.14 శాతం పెరిగింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో విప్రో రూ. 2,968 కోట్లుగా నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 3.4 శాతం పెరిగి రూ. 16,245.4 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 15,711 కోట్ల ఆదాయాన్ని వెల్లడించింది. ఇవి గత పదేళ్లలో కంపెనీ సాధించిన అత్యుత్తమ నాలుగో త్రైమాసిక ఫలితాలని విప్రో తెలిపింది.

ఐటీ సేవల ఆదాయం రూ. 15,891.7 కోట్లుగా ఉంది. వడ్డీ, పన్నులకు ముందు ఐటీ సేవల ఆదాయం రూ. 3,417 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘బలమైన ఆదాయంతో పాటు మెరుగైన అగ్రిమెంట్‌లను సాధించినట్టు’ విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్ట్ చెప్పారు. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసే తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 2-4 శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది. ఇక, 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి విప్రో రూ. 10,796.4 కోట్ల నికర లాభాలను నమోదు చేయగా, ఆదాయం రూ. 61,943 కోట్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed