నేడు కేబినెట్​ భేటీ.. సడలింపులకు ఛాన్స్..?

by Shyam |   ( Updated:2021-05-30 02:27:10.0  )
నేడు కేబినెట్​ భేటీ.. సడలింపులకు ఛాన్స్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్‌డౌన్​ కొనసాగింపుపై రాష్ట్ర కేబినెట్ నేడు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఓ వైపు కేంద్రం కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ రాష్ట్రాలకు సూచించింది. లాక్‌డౌన్‌తో చాలా వరకు పాజిటివ్ కేసులు తగ్గుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగనుంది. దీనిలో పలు అంశాలు కీలకంగా ప్రస్తావనకు రానున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకైతే కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ కఠినంగానే అమలవుతోంది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని వర్తక, వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి ఇవ్వడం లేదు. రోజులో 20 గంటలు లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఆదివారం వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్​అమల్లో ఉండనుంది. అయితే ఆదివారం తర్వాత ఏమిటీ..?, లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? లేదంటే కరోనా కేసులు తగ్గాయని సడలింపులు ఇస్తారా? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం జరిగే మంత్రి మండలి సమావేశం తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

సడలింపు పెంచుతారా..?

రాష్ట్రంలో ఆంక్షల సడలింపు సమయం పెంచి లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల టాక్. దీనిపై నేడు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌, వానాకాలం పంటల ప్రణాళిక సహా పలు కీలక అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు రానున్న విషయం తెలిసిందే. మరోవైపు కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో ఆంక్షలను మరికొంత కాలం పొడిగిస్తే బాగుండన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండటంతో మంత్రి మండలి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఉదయం వేళల్లో సడలింపు పెంచే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆంక్షలు ఎత్తివేసి, రాత్రి కర్ఫ్యూ విధించే ఛాన్స్​కూడా ఉందని ప్రభుత్వవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు వైద్యారోగ్య శాఖ తరుఫున మాత్రం ఇప్పటిలాగే లాక్‌డౌన్ పొడిగించాలని సూచించినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 10 వరకు లాక్‌డౌన్​ఉంటే కేసుల సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో ఇంటింటి సర్వే, మెడికల్​కిట్ల పంపిణీ, పాజిటివ్ కేసులు, బ్లాక్‌ఫంగస్‌ పరిణామాలతో పాటు వాటికి చికిత్స, మందులు, రెండోదశ టీకాలు, కొవిడ్‌ పరీక్షల పెంపు, ఆక్సిజన్‌ ఉత్పత్తి, సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే, లక్షణాలున్న వారికి కిట్ల పంపిణీని సమీక్షిస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వైద్యారోగ్య, హోంశాఖలకు బడ్జెట్‌ పెంచుతామని, కొన్ని శాఖలకు తగ్గిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసే అవకాశముంది.

లాక్‌డౌన్ ​సడలిస్తే ఎలా ఉంటుంది..?

మరోవైపు ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై ఆయా వర్గాల నుంచి వివరాలను సేకరిస్తోంది. పోలీస్, నిఘా వర్గాలతో పాటు పలువురు ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తీసుకుంటుంది. ప్రస్తుతం లాక్‌డౌన్​ఆంక్షలు సడలిస్తారనుకుంటున్నా.. దానిపై సమగ్ర సమాచారం తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సడలింపులు ఇస్తే.. జనం విచ్చల విడిగా రోడ్ల మీదకు వస్తారన్న అభిప్రాయాలను పోలీస్ శాఖతో పాటు వైద్యారోగ్య శాఖ కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే మళ్లీ కరోనా విజృంభించవచ్చని, అందుకే మరో రెండు వారాల వరకు లాక్‌డౌన్‌ను యథాతధంగా కొనసాగించాలని ఆయా విభాగాలు సూచిస్తున్నాయి. దీనిపై మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ప్రక్రియ, గ్లోబల్ టెండర్ల అంశంపై చర్చించనున్నారు. ప్రస్తుతం గ్లోబల్​టెండర్ల ప్రక్రియలో కేవలం రెండు సంస్థలు పాల్గొనడం, అటు సెంట్రల్ నుంచి సరిపడా వ్యాక్సిన్లు వచ్చే అవకాశం లేకపోవడంతో దీనిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

వ్యవసాయంపై కూడా..!

వచ్చే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగంపై కేబినెట్‌లో చర్చించనున్నారు. వచ్చే సీజన్‌లో సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని, కోటీ 40 లక్షల ఎకరాలకు పైగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ వానాకాలం పంటల ప్రణాళికను మంత్రిమండలి ఖరారు చేయనుంది. నీటి వినియోగం, వరి, పత్తితో పాటు ఇతర పంటలు ఎంత మేరకు సాగు చేయాలనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

రైతులను కష్టాలకు గురి చేస్తున్న కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు మరింత కఠిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో ధాన్యం కొనుగోళ్లకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఇంకా రోడ్లపైనే ధాన్యం ఆరబెట్టి ఉంది. చాలా ప్రాంతాల్లో పలు కారణాలతో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ చాలా జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యయని కేంద్రాలను కూడా మూసివేసినట్లు పౌరసరఫరాల సంస్థ ప్రకటించింది.

దీంతో అసలు ధాన్యం కొనుగోళ్లు ఎంత వరకు వచ్చాయి? ఇంకా ఎంత ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని సంబంధిత మంత్రులు, అధికారులతో మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. ఇక వచ్చేనెల మొదటి వారం నుంచే వానాకాలం పంటల సీజన్‌ ప్రారంభం కానుండటంతో పంటల సాగు, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్‌లో సడలింపు సమయాన్ని మరికొన్ని గంటలు పెంచే అవకాశమున్నట్లు అధికారులు చెప్పుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed