పీసీసీ పీట ముడి వీడేది ఎప్పుడో..?

by Anukaran |   ( Updated:2021-06-13 23:40:13.0  )
Gandhi Bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రకటన రోజురోజుకూ వాయిదా పడుతూనే ఉంది. అసమ్మతిని చల్లార్చడానికి అధిష్ఠానం వీలైనంతగా నాన్చాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆశావహులు మాత్రం క్షణమొక యుగంగా ఎదురుచూస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు మీద ప్రకటన ఎప్పుడొస్తుందోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

పీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధు యాష్కీలు మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం పెట్టారు. తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం ఆ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ ప్రకటన రాగానే అసమ్మతి స్వరం కోసం చాలా మంది సీనియర్లు కాచుకుని కూర్చున్నారు. ఇప్పుడు ప్రకటనలతో సరిపెడుతున్న వీరు ప్రకటన తర్వాత ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుని దాదాపు రెండున్నరేళ్ళు కావస్తున్నా ఇంకా ఆయనే తాత్కాలిక ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. నాయకత్వాన్ని మారుస్తామంటూ పార్టీ అధిష్ఠానం అప్పటి నుంచీ చెప్తున్నా ఆచరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి తరహాలోనే ఉంది. కొత్త పీసీసీ చీఫ్ ప్రకటనపై నిర్ణయం తీసుకోలేని అధిష్ఠానం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నది. పీసీసీ చీఫ్ బాధ్యతలు ఎవరికి కట్టబెడితే బాగుంటుందో లీడర్ల నుంచి కేడర్ వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్‌లో మకాం వేసి నాలుగైదు రోజుల పాటు సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. దానికి అనుగుణంగా పార్టీ నాయకత్వానికి నివేదిక కూడా సమర్పించారు. అది జరిగిపోయి ఐదు నెలలు కావస్తున్నా అధిష్ఠానం మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇప్పటికీ ప్రకటించలేకపోయింది.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తికాగానే కొత్త పీసీసీ చీఫ్‌ను ప్రకటిస్తామని స్వయంగా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకటించారు. కానీ అది అయిపోయి కూడా రెండు నెలలు దాటింది. అసమ్మతిని చల్లార్చడంలో నాయకత్వం విఫలం కావడం మాత్రమే కాక కొత్త పీసీసీ చీఫ్‌పై నిర్ణయం తీసుకోడానికి సాహసించడంలేదు. ఈలోపు హుజూరాబాద్ ఉప ఎన్నికకు కూడా రంగం సిద్ధమవుతున్నది. అక్కడ కేసీఆర్ వర్సెస్ ఈటల మధ్య పోరు ముమ్మరంగా ఉన్నా దాదాపు పాతిక వేలకు పైగా ఉన్న కాంగ్రెస్ ఓట్లు ఎటు వెళ్తాయో తెలియని గందరగోళం నెలకొన్నది.

గత వారం రోజులుగా ఇదిగో.. అదిగో అంటూ పీసీసీ చీఫ్ మార్పు ప్రకటన వస్తుందని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నా ఎదురుచూపులతోనే సరిపోయింది. కేరళ పీసీసీ చీఫ్ మార్పును ప్రకటించిన వెంటనే తెలంగాణ, పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రకటన వస్తుందని చెప్పినా ఇప్పటికీ వెయిటింగ్‌లోనే ఉండిపోయింది ఆ వ్యవహారం.

Advertisement

Next Story

Most Viewed