- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్పొరేట్ ఆస్పత్రులపై కొరడా.. పర్మిషన్ రద్దు
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ పేరుతో లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి కరోనా ట్రీట్‌మెంట్ చేయడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం గురువారం నోటీసులు జారీచేసింది. పేషెంట్ల నుంచి హెచ్చు మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో గతంలో షోకాజ్ నోటీసు ఇచ్చిన ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఇకపైన కొవిడ్ ట్రీట్‌మెంట్ కోసం కొత్త పేషెంట్లను చేర్చుకోవద్దని నోటీసులు ఇచ్చింది. మరో రెండు ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు బాధితుల నుంచి ఆన్‌లైన్, హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా 51 ఫిర్యాదులు వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కొవిడ్ ట్రీట్‌మెంట్ ఇచ్చిన అనుమతిని రద్దు చేసినందున ఇప్పటికే అడ్మిషన్ అయి ఉన్న పేషెంట్లకు మాత్రమే చికిత్స అందించాలని స్పష్టం చేసింది. ఇకపైన కొత్తగా కరోనా పేషెంట్లను చేర్చుకోవద్దని నొక్కిచెప్పింది. కరోనా పేషెంట్లకు ఏ చికిత్సకు ఎంత మొత్తంలో ఛార్జి వసూలు చేయాలో ప్రభుత్వం స్పష్టంగా జీవో ద్వారా వెల్లడించినప్పటికీ దానికి విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసినందుకు, ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆ ఉన్నతాధికారి వివరించారు.
మరో రెండు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసు
నగరంలోని మరో రెండు ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. బాధితుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందడంతో సంబంధిత ఆస్పత్రికి సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఈ నోటీసు గురువారం జారీ అయింది. ఏయే వైద్య పరీక్షకు, బెడ్‌కు, డాక్టర్ల కన్సల్టేషన్ ఫీజు రూపంలో ఛార్జీలు వసూలు చేశారో పరిగణనలోకి తీసుకున్న వైద్యారోగ్య శాఖ నిర్దిష్ట గడువులోగా వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేసింది. ఆ వివరణకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆ ఉన్నతాధికారి పేర్కొన్నారు. గతేడాది తొలి వేవ్ సందర్భంగా రెండు ప్రైవేటు ఆస్పత్రులకు ఇదే తరహా అనుమతి రద్దు చేయగా, ఈసారి 51 ఫిర్యాదులపై పరిశీలన, కార్యాచరణ మొదలైంది.
కరోనా సెకండ్ వేవ్‌లో పేషెంట్ల ఆరోగ్య స్థితి సీరియస్‌గా ఉండడం, ఎక్కువ మందికి ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ అవసరం ఏర్పడుతుండడంతో అధిక మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. నాలుగైదు రోజులకే లక్షల మొత్తంలో బిల్లులు వేస్తున్నాయి. మంత్రులకు, అధికారులకు ట్విట్టర్ ద్వారా, మెయిల్ ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఫిర్యాదులు వెళ్తున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ సరిగ్గా లేకపోవడంతో ఆందోళనతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న పేషెంట్లకు కరోనా తగ్గినా బిల్లు మాత్రం మోయరాని భారంగా మారడంతో అప్పులపాలవుతున్నారు. ప్రజారోగ్య వ్యవస్థ గాడి తప్పడం, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకీ అడ్డుకట్ట వేయలేని నిస్సహాయ స్థితిలో పేషెంట్లే బాధితులుగా మారుతున్నారు. గతేడాది లాగానే ఒకటి రెండు ఆస్పత్రులతోనే ప్రభుత్వం తన బాధ్యతను దులిపేసుకుంటుందా లేక నిబంధనల ప్రకారమే ఛార్జీలను వసూలు చేయాలంటూ కొరడా ఝళిపిస్తుందా అనేది వేచి చూడాలి.