హలో.. యమా! సెల్‌ఫోన్ డ్రైవింగ్.. పిలుపు అక్కడికే?

by Shiva |
హలో.. యమా! సెల్‌ఫోన్ డ్రైవింగ్.. పిలుపు అక్కడికే?
X

ఇంట్లో ఉన్నంతసేపూ.. ‘ఆ.. హలో చెప్పూ.. ఇంకా’ అంటూ అదే సొల్లు పురాణం..

కనీసం బయటకు వెళ్లేటప్పుడైనా పక్కన పెడతామా.?

అదీ ఉండదు...అదేదో కొంపలు మునిగిపోయినట్టు..

డ్రైవింగ్ చేస్తూనే సెల్‌లో వాగుతూనే ఉంటాం.

ఇదెంత డేంజరో ఒక్కసారైనా ఆలోచించామా.?

హా.. మనకంత సీనెక్కడిది.?

కొందరికి సెల్‌ఫోన్ డ్రైవింగ్ మహా సరదా. వాళ్లకలా చేస్తుంటే ఎక్కడలేని సంతోషమైతది. బండి స్టార్ట్ చేయడంతోనే మొదలు పెడతారు. ‘హే బాబూ.. ఆపి మాట్లాడరాదు. నువ్వు బాగనే పోతవ్.. కానీ నిన్ను తప్పించబోయి మాకు యాక్సిడెంటైతది’ అని ఎవరైనా చెప్తే అస్సలు నచ్చదు. ‘పెద్ద చెప్పొచ్చాడండీ’ అని వారినే హేళన చేస్తారు. కానీ ఆ మాటల్ని పట్టించుకోరు యాక్సిడెంట్ జరిగే వరకూ...

డ్రైవింగ్‌లో చాటింగ్ ఏంటి.?

సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపటమే తప్పురా నాయనా అంటే కొందరు చాటింగ్ చేస్తుంటారు. వాళ్లు చేసే ఆ గొప్ప పనికి ఇంకెక్కడా ప్లేస్ దొరకనట్టు ఒకచేత్తో డ్రైవింగ్ చేస్తూ ఇంకో చేత్తో మెసేజ్ టైపింగ్ చేస్తుంటారు. నిజంగా ఇదెంత ప్రమాదకరం ? మైండ్ పరధ్యానంలోకి వెళ్లిపోతుంది. డ్రైవింగ్ మీద కాన్‌సెంట్రేషన్ ఉండదు. ఎదురుగా ఏమొస్తుందో అనే ధ్యాసే ఉండదు. గాచారం గల్లా ఎగిరేస్తే ఇక అంతే సంగతి.

డే/నైట్.. ఒకటే గోల

పొద్దు లేదు.. రాత్రి లేదు.. డ్రైవింగ్ చేస్తున్నామంటే చేతిలో ఫోన్ ఉండాల్సిందే.. ‘హలో.. తిన్నవా.. ఏం కూర’ అని ముచ్చట పెట్టాల్సిందే. అన్నీ పిచ్చాపాటి కబుర్లే. ఒక్కటి పనికొచ్చేది ఉండదు. కొందరైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటపుడు లేదా ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చేటపుడు నిత్యం అదే పని. గమ్యం చేరుకునే వరకు ఫోన్ ఆన్ లోనే ఉంటుంది. అంత ముఖ్యమైతే కాసేపు ఆగి మాట్లాడొచ్చు కదా.. అంటే అలా ఉండదు.. డ్రైవింగ్ లోనే రన్నింగ్ కామెంట్రీ... ఇంకేమైనా అంటే ఆ కిక్కే వేరప్పా..? అని ఓ వెకిలి సమాధానం.

సడెన్ బ్రేక్ వేయాల్సి వస్తే.?

ఒకదిక్కు ఫోన్.. ఇంకోదిక్కు డ్రైవింగ్.. మన పక్కనుంచి ఇంకెవడో స్పీడ్‌గా వచ్చి ఓవర్ టేకింగ్ చేస్తూ డ్యాషిచ్చిపోతే ? సడెన్ బ్రేక్ వేయాల్సి వస్తే.. సెల్‌ఫోన్ మాట్లాడే బిజీలో మనముండే స్పీడ్‌ను కంట్రోలింగ్ చేయగలుగుతామా.? ప్రమాదం జరగకుండా సేఫ్‌గా ముందుకెళ్తామా.? రోడ్డు నిబంధనలు పాటించకుండా సురక్షితమైన డ్రైవింగ్ చేయగలుగుతామా.? మల్టీ టాస్కింగ్ సామర్థ్యాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేయడం వల్ల అనేక సమస్యలొస్తాయి.

సమస్యను కొనితెచ్చుకోవద్దు

మనమేదో అత్యవసర పనిమీద బయటికి వెళ్తాం. హాస్పిటల్ పనో లేక ఆపద పనో. అవతలి వాళ్లకు మనం ఎక్కడున్నాం.. ఎలా ఉన్నామనేవి తెలియవు. అందుకే ఊకే ఫోన్ కొడుతుంటారు. మనమెంత తొందరగా వస్తే అంత సమస్య తీవ్రత తగ్గుతుందనేది వారి ఉద్దేశం కావచ్చ. అందుకే ఫోన్ లేపకపోయినా మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి.. అక్కడి సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ముందే వాళ్లకు చెప్పి ప్రయాణం స్టార్ట్ చేయడం. లేదంటే మధ్యలో ఫోన్ కాల్ వస్తే ఆపి మాట్లాడి సముదాయించడం. అలా కాకుండా ఆత్రంతో డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ మాట్లాడి.. ఇప్పటికే ఓ సమస్య ఉందంటే దానికితోడు ఇంకో సమస్యను కొనితెచ్చుకోవద్దు. ఎందుకంటే జీవితం ముఖ్యం.. ఫోన్ కాల్ కాదు.

రిస్క్ ఎందుకు.?

సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం అని తెలుసు. అయినప్పటికీ దాన్ని కంట్రోల్ చేసుకోలేం. ‘ఎహె.. నాకేమైతది.. గింత చిన్న విషయానికే ఆగమైతే ఎట్లా ?’ అనుకుంటారు. కానీ.. జరగరానిది ఏదైనా జరిగితే ఎంత పెద్ద రిస్క్ చేశామో ఆత్మపరిశీలన చేసుకోవడానికి కూడా ఉండం అనే విషయాన్ని గ్రహిస్తే మంచిది. రిస్క్ చేయడం మీకు సరదానేమో. కానీ.. మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా.. మీ సరదా ఒక జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో మీ నిర్లక్ష్యానికి ఒకసారి చెప్పండి. ఇంకా కొందరైతే.. ‘నేను రోజు ఇట్లనే పోతుంటా.. ఇయాల కొత్తగవోతున్ననా.. నేనెంత ఫోన్ మాట్లాడినా సేఫ్‌గనే పోతా ’ అనే అపోహలో ఉంటారు. డ్రైవింగ్ నైపుణ్యంపై అతి అంచనా వేసుకోవడడం ఎంతో ప్రమాదం.

ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్

టూ వీలర్.. ఫోర్ వీలర్.. ఇలా ఏది డ్రైవ్ చేసినా సెల్‌ఫోన్ వాడకం తప్పే. కొందరు ‘టింగ్’మని చిన్న మెసేజ్ సౌండ్ రాగానే ఫోన్ తీసి చెక్ చేస్తుంటారు. ఎందుకంత ఆత్రం.? ఇప్పుడు కాకపోతే ఇంకో ఐదు నిమిషాలకు నీ ఫోన్‌ను చూసుకుంటావు కదా.? ‘టింగ్ ’మనే సౌండ్ రాగానే చూసుకునేంత అత్యవసర సందేశం ఏముంటుంది చెప్పండి.? ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్’ (ఫోమో) అనే మానసిక స్థితి ఉన్నవాళ్లే ఇలా చేస్తుంటారని నిపుణులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో లేదా వృత్తిపరమైన కమ్యూనికేషన్ ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ ఫోమో భయంతో ప్రతీ 240 సెకన్లకు ఒకసారి ఫోన్ చెక్ చేసుకుంటారట. అంటే ఫోన్ చూడకుండా కనీసం 300 సెకన్లు కూడా ఉండలేకపోతున్నామంటే దానికి మనమెంత అడిక్ట్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు.

డిజిటల్ డిపెండెన్సీ

నిబంధనలను పాటించడం కంటే ‘ఇది చిన్న విషయం.. దీనివల్ల ఎవరికీ హాని జరగదు’ అనే భావనతో చాలామంది ఉంటారు. వీళ్లేంటంటే చాలా సాధారణమైన నిబంధనలను కూడా వీళ్లు పట్టించుకోరు. దీనిని ‘రూల్ ఇగ్నోరెన్స్’ అని అంటారు. కొందరేమో ఫోన్ ద్వారానే ప్రపంచంతో కనెక్ట్ అవుతారు. ఈ ‘డిజిటల్ డిపెండెన్సీ’ వాళ్లను డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడేలా ప్రేరేపిస్తుంది. కాలాన్ని వృథా చేయొద్దని మంచి ఉద్దేశం ఉన్నవారు కూడా డ్రైవింగ్ విషయానికి వచ్చేసరికి నిబంధనలను పాటించరు. ‘టైమ్ ఆప్టిమైజేషన్’ ఒక్కటే కాదు కదా.. ‘లైఫ్ ఆప్టిమైజేషన్’ కూడా ముఖ్యం కదా అని గ్రహిస్తే ఈ సమస్య ఉండదని నిపుణులు చెప్తున్నారు. Stay Safe, Follow Traffic Rules!

⚠️ ప్రమాదం తీవ్రం

👉 2016లో టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. మొబైల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల సంవత్సరంలో 2,138 మంది చనిపోయారు.

👉 2019లో ఈ సంఖ్య 33% పెరిగింది. అంటే 2,843 మరణాలకు చేరిందనే అంచనా.

👉 2024లో తెలంగాణ రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 26,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

👉 ఇందులో 7,700 మంది మరణించారు.

👉 2025 మార్చి పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య సంవత్సరానికి 2,500-3,000 ఉంటుందని అంచనా.

🔴 1: 4 నిష్పత్తి

👉 ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మైండ్ ఆబ్సెంట్ వల్ల ప్రతీయేటా 1.35 మిలియన్లకు పైగా చనిపోతున్నారు.

👉 జాతీయ భద్రతా మండలి ప్రకారం డ్రైవింగ్ లో కాల్స్.. మెసేజెస్ చేయడం వల్ల ఏటా1.6 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి.

👉 సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) రిపోర్ట్ ప్రకారం పరధ్యాన డ్రైవింగ్ వల్ల ఏటా 3000 మంది చనిపోతున్నారు.

👉 సెల్‌ఫోన్ డ్రైవింగ్ నిష్పత్తి 1: 4గా ఉందని హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టీఎస్ఏ) తెలిపింది.

🚫 ఏం చేయొద్దంటే

👉 డ్రైవింగ్ చేసేటప్పుడు మెసేజ్ టైప్ చేయొద్దు.

👉 వీడియో కాల్స్.. సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్స్ వద్దు.

👉 స్టీరింగ్ వదిలి ఫోన్ ఎడ్జెస్ట్ చేయకండి.

👉 ఫోన్ మాట్లాడుతూ మ్యాప్ చెక్ చేయకండి.

📌 కఠిన చర్యలు

👉 కొత్త వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడితే ₹1,000 – ₹5,000 ఫైన్ వేస్తారు.

👉 3 నెలల వరకు లైసెన్స్ సస్పెన్షన్ ఉంటుంది.

👉 ప్రమాదకర డ్రైవింగ్ అని కేసు నమోదైతే 6 నెలల శిక్ష.

👉 సీరియస్ ప్రమాదం జరిగితే 6 నెలల కంటే ఎక్కువ జైలు శిక్ష.

స్వచ్ఛందంగా రూల్స్ పాటించాలి

ట్రాఫిక్ రూల్స్‌పై ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. మార్పు రావాలని జరిమానాలు వేస్తున్నాం. నేనైతే వ్యక్తితగంగా కల్చరల్ ప్రోగ్రామ్స్.. జానపద పాటలు రూపొందిస్తున్నాను. కొంతవరకు మార్పు తీసుకురాగలిగాం. కానీ.. ప్రజలు స్వచ్ఛంద మార్పుతోనే సంపూర్ణ మార్పు సాధ్య అవుతుంది. కాబట్టీ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడటం మానేయాలి. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలి.

- అంజపల్లి నాగమల్లు, ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్

యాక్సిడెంట్ జరిగాక తెలిసొచ్చింది

నాకు వెహికిల్‌.. మొబైల్ ఫోన్‌తోనే ఎక్కువ పని. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడే 20-30 ఫోన్ కాల్స్ వస్తాయి. ఒకసారి మెటీరియల్ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నా. వర్కర్స్ ఏదో టెన్షన్ పెడుతుంటే ఆ కంగారులో డ్రైవింగ్‌పై ధ్యాస పోయి ఇలా జరిగింది. ఇక అప్పటి నుంచి ఫోన్ వస్తే పక్కకు ఆపి మాట్లాడుతున్నా. - సాయి కృష్ణ, ఇంజినీర్

Next Story

Most Viewed