కేసీఆర్ వ్యూహాత్మక మౌనం.. ఓటమి భయమా?

by Anukaran |   ( Updated:2020-11-28 22:51:43.0  )
కేసీఆర్ వ్యూహాత్మక మౌనం.. ఓటమి భయమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రసంగంలో ఎక్కడ కూడా మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలను ప్రస్తావించలేదు. ఉద్దేశపూర్వకంగానే వాటి ప్రస్తావన చేయకుండా బ్యాలెన్స్ వైఖరి అవలంభించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదని, తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని పరిమిత కామెంట్లకే పరిమితమైన కేసీఆర్ ఆగ్రహం కలిగించేంత ఘాటుగా వ్యాఖ్యానించకపోవడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడే అనే చర్చలు వినిపిస్తున్నాయి. ఓటమి భయంతోనే మాటల్లేక ఆయన ప్రసంగంలో పసలేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా స్వంత పార్టీ కార్యకర్తలు కూడా కేసీఆర్ ప్రసంగంలో జోష్ లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు.

విమర్శలపై నో..కామెంట్స్

బీజేపీ గత పది రోజులుగా ఎన్నికల సభల్లో, ర్యాలీల్లో, రోడ్‌షోలలో మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ దోస్తానా చేస్తోందని, ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం ఆ పార్టీకి దాసోహమైపోయిందని విమర్శిస్తూ ఉంది. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ మతతత్వ పార్టీ అయిన మజ్లిస్‌తో ఎందుకు అంటకాగుతోందని ప్రశ్నించింది. దారూసలాంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్‌లో రీసౌండ్ వస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్లకు కేసీఆర్ ఘాటుగానే జవాబిస్తారన్న అంచనాలు ఉన్నాయి. కానీ, దాదాపు యాభై నిమిషాల ప్రసంగంలో మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల గురించి ఎక్కడా చిన్న ప్రస్తావన కూడా తీసుకురాలేదు.

భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో జరిగే మార్పులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ తన ప్రసంగాన్ని ఆచితూచి చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మజ్లిస్ ప్రస్తావన తెస్తే మళ్లీ కమ్యూనల్, సెక్యులర్ లాంటివి జోడించక తప్పదని, దానికి కొనసాగింపుగా హిందూ-ముస్లిం కూడా ప్రస్తావించాల్సి వస్తుందని, ఇది రాజకీయంగా ఇబ్బందికరంగా పరిణమిస్తుందన్న ఉద్దేశంతోనే ఆ అంశాన్ని ముట్టుకోలేదని కొద్దిమంది రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు. మజ్లిస్ ప్రధాన ప్రత్యర్థి అని టీఆర్ఎస్ చెప్పుకుంటున్నా దాని గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం ఒక వ్యూహం ప్రకారమే జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రెండు పార్టీలను కలిపి కామెంట్..

కాంగ్రెస్ పార్టీని ఇంతకాలం తిట్టిపోసిన కేసీఆర్ ఇప్పుడు తన ప్రసంగంలో రెండు జాతీయ పార్టీలను కలిపి కామెంట్ చేశారే తప్ప నిర్దిష్టంగా ఘాటైన వ్యాఖ్యలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేసినప్పటికీ ఆగ్రహం కలిగించే తీరులో దూకుడుగా మాట్లాడితే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టకుని పరిమితంగానే వ్యవహరించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఘాటుగా మాట్లాడితే ఎలాంటి ప్రభావం చూపుతుందోననే భయంతోపాటు అమిత్ షా పర్యటన తర్వాత దాని పర్యావసానాలు ఎలా ఉంటాయోననే ఆందోళన కూడా కారణమై ఉండొచ్చని సీనియర్ రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు.

వరదసాయం అందలేదని అంగీకరించిన సీఎం

హైదరాబాద్ సిటీలో వరదలు వచ్చిన తర్వాత బాధితులను ఆదుకునేందుకు సర్కారు రూ.10వేలు అందించింది. ఈ సాయం కోసం ప్రజలు బారులు తీరారు. అధికార పార్టీ నేతలను నిలదీశారు. ‘మీసేవ’ కేంద్రాల వద్ద అప్లికేషన్ చేసుకోవాలని చెప్పడంతో అక్కడ కూడా క్యూ కట్టారు. సీఎం ప్రసంగంలో వచ్చే నెల 7 నుంచి తిరిగి సాయం పంపిణీ షురూ చేస్తామని చెప్పారు. తద్వారా ఆయనే బాధితుందరికీ సాయం అందలేదని ఒప్పుకున్నట్లయింది. బాధితులకు రూ.667 కోట్లు పంపిణీ చేశామని సీఎం తెలిపారు. కానీ, ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారు? వారిని ఆదుకునేందుకు ఎంత డబ్బు అవసరమవుతుంది? వంటి విషయాలపై సర్కారుకు స్పష్టత లేదని సీఎం మాటలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed