ఒక్క పెన్నుపోటు.. ఎటు పోయింది?

by Aamani |
ఒక్క పెన్నుపోటు.. ఎటు పోయింది?
X

‘రెగ్యులర్.. కాంట్రాక్టు.. అవుట్ సోర్సింగ్.. ఇన్ సోర్సింగ్.. ఇవన్నీ ఏంటి..? అందరూ చేసేది అదే పని కదా..! రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేసినప్పుడు వేతనాల్లో వ్యత్యాసం ఏంటి..? ఇవన్నీ చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒకే ఒక్క పెన్నుపోటుతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ రెగ్యులర్ చేసేస్తా..!’ఏడేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పిన మాటలు ఇవి. కానీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం… ఆరేళ్లకు పైబడి అధికారం చెలాయిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇప్పుడు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంటేనే ఒంటికాలి మీద లేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు రెండు లక్షల దాకా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగులు ఉన్నారని అంచనా. అయితే వీరిలో ప్రణాళికాబద్ధంగా, రెగ్యులర్ ఉద్యోగుల నియామకాల పద్ధతిలో ఉద్యోగాలు పొందిన వారు సుమారు 50 వేల దాకా ఉంటారని చెబుతున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో 10 వేలకు పైగా ఉద్యోగులు అన్ని అర్హతలు ఉండి రాత పరీక్షలు, జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా నియామకాలు అయిన వాళ్లు ఉన్నారు. సుమారు 15 నుంచి 20 ఏండ్లుగా అనేకమంది ఇప్పటికీ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల వేతన సవరణ సమయంలో… కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు కూడా సవరిస్తున్నప్పటికీ రెగ్యులరైజేషన్ విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. ఇలాంటివారిని క్రమబద్ధీకరించకుండా, ఇంకా కాంట్రాక్టు విధానంలోనే కొనసాగించడం అన్యాయమని ఉద్యోగసంఘాలు ఆక్షేపిస్తున్నాయి. అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన ఉండటం లేదు. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ఈ విషయంలో నోరు మెదపని పరిస్థితి ఉంది. దీన్నిబట్టి తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయనే భరోసా ఉద్యోగుల్లో కనిపించడం లేదు.

మళ్లీ మొండిచేయి..

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే విషయంలో ప్రభుత్వం మళ్లీ మొండి చేయి చూపింది. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టు‌లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, రేడియో గ్రాఫర్లు, స్టాఫ్ నర్సులు ఇలా అనేక మంది పారా మెడికల్ ఉద్యోగులను కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకున్నారు. వీరిలో అనేక మంది 15 నుంచి 20 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. తమను రెగ్యులర్ చేయాలని వీళ్లు ఎమ్మెల్యే లు, ఎంపీలు, మంత్రులు, సీఎం దాకా అందరినీ కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ప్రభుత్వం వీరిలో కొందరు ఉద్యోగులకు ఏడాదిపాటు పొడిగింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ సి నెంబరు 4352, తేదీ 22.05.2020 ప్రకారం ఉద్యోగ కాలాన్ని ఏడాది పాటు పొడిగించింది. వీరిలో 199 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 189 ఫార్మాసిస్ట్ లు, 1202 మంది మేల్ హెల్త్ అసిస్టెంట్లు మరో ఏడాదిపాటు ఉద్యోగంలో కొనసాగనున్నారు. దీన్నిబట్టి మిగిలిన కేడర్ల ఉద్యోగుల విషయంలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. వారి కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిసిన వెంటనే మరో ఏడాదికి పొడిగింపు ఉత్తర్వులు వెలువడతాయని చెబుతున్నారు.

కరోనా సమయంలోనూ కనికరం లేదా?

వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు తాజాగా కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేశారు. వారు పడిన కష్టాన్ని చూసైనా ప్రభుత్వం రెగ్యులర్ ఉత్తర్వులు జారీ చేసి ఉంటే తమలో మనోధైర్యం నిండి ఉండేదని ఆరోగ్య శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఏటా ఏడాది పాటు పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం మినహా ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోక పోతుండటంతో ఉద్యోగుల్లో నిరాశా నిస్పృహలు అలుముకుంటున్నాయి.

20 ఏళ్లు గడుస్తున్నా రెగ్యులర్ చేయలే : పురుషోత్తం, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నేత

ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 20 ఏండ్ల క్రితం ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్‌గా చేరాం. ఇప్పటిదాకా రెగ్యులర్ కాలేదు. తెలంగాణ వస్తే కచ్చితంగా రెగ్యులర్ అవుతుందని నమ్మాం. వివిధ కారణాలు చెబుతూ వాయిదా వేస్తున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక అయ్యాం. ఇప్పటికైనా తమను రెగ్యులర్ చేస్తే సంతోషిస్తాం.

Advertisement

Next Story

Most Viewed