ఓరుగల్లును ముంచింది వీళ్లేనా..?

by Shyam |
ఓరుగల్లును ముంచింది వీళ్లేనా..?
X

దిశ ప్రతినిధి, వరంగల్:

వరంగల్ నగరం ముంపునకు కారణం మీరంటే మీరేనని రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ప్రజల కష్టాలను చూసేందుకు వచ్చిన వాళ్లంతా నాలాలు, చెరువులు కబ్జాకు గురవడం వల్లే వరంగల్ నగరం మునగడానికి కారణమని అంటున్నాయి. కబ్జా అయింది వాస్తవమే అయినప్పటికీ అక్రమార్కులు ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీంతో అసలు కభ్జారాయుళ్లు ఎవరనే విషయమై వరంగల్ జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది.

పది రోజులుగా కురిసిన వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలం అయ్యింది. ఏకంగా 120 కాలనీల్లోకి నీళ్లు చేరాయి. ఎన్నడూ లేని విధంగా వరద కాలనీల్లోకి వరద పోటెత్తింది. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అయిన వరంగల్ ఈ దుస్థితికి చేరడానికి కారణం మీరంటే మీరని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ నేతలే దీనికి కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తే.. కాదు కాదు గత పాలకుల హయాంలోనే జరిగిన తప్పిదాలతో ఈ దుస్థితి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. కానీ సామాన్యుల ఇబ్బందులను మాత్రం ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నగరంలోని వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడడానికి రాజకీయ నేతలే కారణం అనేది అక్షర సత్యం. అధికారంలో ఏ పార్టీ ఉంటే వారి పంచన చేరే నేతల చర్యల కారణంగానే వరంగల్ నగరానికి ఈ దుస్థితి పట్టుకున్నట్లు అభిప్రాయాలున్నాయి.

చేతులు దులుపుకున్న రియల్ వ్యాపారులు..

నగరంలో పెరిగిన రియల్ దందాలతో వారి పబ్బం గడుపు కునేందుకు చెరువులు, నాలాలు ఆక్రమించిన అక్రమార్కులు వెంటనే భూములు అమ్మేసి జేబులు నింపుకుని ఒడ్డున పడ్డారు. తక్కువ ధరకే భూములు వస్తున్నాయి కదా అని చెరువు శిఖం, నాలాల పక్కన ఉన్న భూములను అమాయకులు కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు వారిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. వరంగల్ నగరంలోని ఎమ్మెల్యేల అనుచరుల తీరుతోనే పెద్ద ఎత్తున భూములు కబ్జా అయ్యాయనే ఆరోపణలున్నాయి. అక్రమార్కులను వెనకాలే తిప్పుకుంటున్న నేతలు కబ్జా దారులను వదిలేది లేదంటూ బహిరంగ ప్రకటనలు చేయడం పట్ల అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటు వామపక్షాలు.. అటు ప్రధాన పార్టీలు..

మురికివాడల్లో వెలిసిన గుడిసెలకు వామపక్ష పార్టీల అండ, పెద్దపెద్ద భవంతులకు ప్రధాన పార్టీల అండ ఇలా ఎవరికీ వాళ్లు పరోక్షంగా సపోర్టు చేసి ఇప్పుడు కబ్జాలపై మాట్లాడడంపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నగరంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు కబ్జాలపై కామెంట్ చేయడంతో ఆ పార్టీ నేతల ఇండ్లను టార్గెట్ చేసిన అధికారులు మంత్రి కేటీఆర్ టూర్‌లో భాగంగా కూల్చిన తీరు సైతం నగరంలో చర్చకు దారి తీసింది.

ఇక టీఆర్ఎస్‌లో కీలక నేత భద్రకాళి చెరువులో దర్జాగా క్యాంప్ కార్యాలయం నిర్మాణం చేసినా అటువైపు కన్నెత్తి చూడని అధికారులు నాలాల పక్కనే ఉన్న గుడిసెలను తొలగించేందుకు రెడీ అవుతున్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడే నాలాలపై ఆక్రమణలు లేకుండా మార్కింగ్ చేసిన అధికారులు ఆ తర్వాత నిర్మాణాలు ఎందుకు ఆపలేక పోయారనే ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయ నేతల అండదండలతోనే నాలాలపై యథేచ్చగా నిర్మాణాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story