ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా వీఆర్ఏలకు న్యాయం జరగదా?

by Ravi |   ( Updated:2022-09-03 13:33:10.0  )
ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా వీఆర్ఏలకు న్యాయం జరగదా?
X

ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేలు వర్తింపజేస్తామని, వారసులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. నెలలు గడుస్తున్నా ఆ ప్రకటన అమలు కాకపోవడం వీఆర్ఏల భవిష్యత్తును చీకటిమయం చేసింది. ఇలా ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోకపోవడంతో వారు శాంతియుత నిరాహార దీక్షలు నిర్వహించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగారు. వీరికి వివిధ సంఘాలు మద్దతిస్తున్నాయి. తెలంగాణ కట్టు బానిసత్వానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా విప్లవ ఉద్యమాలు నెరపిన నేల. త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు తప్పక న్యాయం జరగాలి.

తెలంగాణ సంస్కృతిలోనూ, చరిత్రలోనూ వారు భాగస్వాములు. ప్రాచీన మధ్య యుగాల గ్రామాలలో ఉన్న 12 మంది ఆయకారులలోనూ వీరికి స్థానముంది. గతంలో వీరిని సుంకరి, నీరడి, తలారి, కావలి కారు, గ్రామసేవకులనే రకరకాల పేర్లతో పిలిచేవారు. ప్రస్తుతం గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) అని అంటున్నారు. వీరు గ్రామస్థాయిలో చెరువులను, కుంటలను పరిరక్షించడం, పంటల నమోదు, వరదలలో సహాయ కార్యక్రమాలు చేయడం తదితర ప్రభుత్వానికి సంబంధించిన సుమారు 36 రకాల విభాగాలకు క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చినపుడు సహాయ సహకారాలు అందించేవారు. గ్రామస్థాయిలో ఏం జరిగినా వీరే ముందుండి ప్రభుత్వానికి సమాచారం అందించేవారు.

రాజ్యాంగబద్ధ నియామకాలు

2012, 2014లో ఏపీపీఎస్‌సీ రిక్రూట్మెంట్ ద్వారా 4,000 మంది వీఆర్ఏలు నియమితులయ్యారు. ప్రస్తుతం 3,000 మంది విధులలో కొనసాగుతున్నారు. రోల్ ఆఫ్ రిజర్వేషన్, ఆర్డర్ ఆఫ్ మెరిట్, రోస్టర్ పాయింట్స్ వంటి అన్ని ప్రభుత్వ నిబంధనలు పాటించి వీరిని నియమించారు. ఐదు సంవత్సరాల సర్వీస్ అనంతరం వీఆర్‌ఓగా పదోన్నతి పొందే అవకాశం ఉండటంతో బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశించారు. అందుకే చాలా మంది నిరుద్యోగులు వీఆర్ఏలుగా చేరారు. వీరిలో ఇంటర్ నుంచి పీహెచ్‌డీ చేసినవారు కూడా ఉన్నారు.

రాజ్యాంగబద్ధంగా నియమితులైన వీరికి ప్రభుత్వ ఉద్యోగికి ఉండాల్సిన ఉద్యోగ భద్రత, పేస్కేలు, పీఎఫ్, మెటర్నిటీ సెలవులు, ఈఎస్ఐ, హెల్త్ కార్డులు ,పెన్షన్, సమయపాలన, పదోన్నతులులాంటివి ఏవీ లేవు. కారుణ్య నియామకం ద్వారా వచ్చిన వారు మాత్రం పదోన్నతి ద్వారా తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టే ముందు కొన్ని జిల్లాలలో మాత్రమే వీఆర్‌ఓలుగా పదోన్నతులు ఇచ్చారు. కొన్ని జిల్లాలలో సీనియారిటీ లిస్ట్ తయారు చేసిన తర్వాత వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు కావడంతో చాలామంది పదోన్నతులు, క్రమబద్ధీకరణ అవకాశం కోల్పోయారు. ఇదే ఏపీపీఎస్‌సీ ద్వారా నియమితులైన ఆంధ్రప్రదేశ్ వీఆర్ఏలు మాత్రం ప్రస్తుతం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లుగా, వీఆర్‌ఓలుగా కొనసాగుతున్నారు.

పదోన్నతుల సమయంలో

తెలంగాణ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కొరకు 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 42 రెవెన్యూ డివిజన్లను 73 డివిజన్లుగా, 466 మండలాలను 594 మండలాలుగా విస్తరించింది. రెవెన్యూ సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీంతో వీఆర్‌ఏలు అటెండర్‌లుగా, డ్రైవర్‌లుగా, నైట్‌ వాచ్‌మెన్‌గా, సహాయకులుగా వెట్టిచాకిరీ చేస్తున్నారు. వీరికి కేవలం 10,500 గౌరవ వేతనం ఇస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు తట్టుకోలేక ఆర్థిక భారంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఇసుక మాఫియా, కబ్జాదారుల చేతులలో దాడులకు గురవుతున్నారు.

సర్వీస్ పరంగా, అర్హత ప్రకారం పదోన్నతులు పొందాల్సిన వీరు కొత్త రెవెన్యూ చట్టం-2020 వలన ఆ అవకాశం కొల్పోయారు. ఈ చట్టం ప్రవేశపెడుతున్న సమయంలో ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేలు వర్తింపజేస్తామని, వారసులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. నెలలు గడుస్తున్నా ఆ ప్రకటన అమలు కాకపోవడం వీఆర్ఏల భవిష్యత్తును చీకటిమయం చేసింది. ఇలా ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోకపోవడంతో వారు శాంతియుత నిరాహార దీక్షలు నిర్వహించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగారు. వీరికి వివిధ సంఘాలు మద్దతిస్తున్నాయి. తెలంగాణ కట్టు బానిసత్వానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా విప్లవ ఉద్యమాలు నెరపిన నేల. త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు తప్పక న్యాయం జరగాలి.

జుర్రు నారాయణ యాదవ్

టీటీయూ జిల్లా అధ్యక్షుడు

మహబూబ్‌నగర్

94940 19270

Advertisement

Next Story