- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్స్‌ఫర్డ్ టీకాతో ముప్పు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్వహించిన ఆక్స్‌ఫర్డ్(భారత్‌లో కొవిషీల్డ్ టీకా) టీకా ట్రయల్స్‌లో పాల్గొన్న 40 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాక్సిన్ డోసుతో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్‌లు వస్తున్నాయని ఆరోపించారు. తనకు నాడీపరమైన సమస్యలతో పాటు మానసికంగానూ దుష్ప్రభావాలు చూపిందని అన్నారు. కొవిషీల్డ్ టీకా ట్రయల్స్, ఉత్పత్తి, పంపిణీలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. టీకా డోసుతో కలిగిన సైడ్ ఎఫెక్టులకు పరిహారంగా రూ. 5 కోట్లు తనకు ఇవ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఐసీఎంఆర్, శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లకు లీగల్ నోటీసులు పంపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా ఫార్మా సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో టీకా ట్రయల్స్ నిర్వహిస్తున్నది. టీకా ట్రయల్స్ విజయవంతమైతే ఉత్పత్తి, పంపిణీలకూ ప్రణాళికలు వేసింది. కొవిషీల్డ్ టీకాను చెన్నైలో శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రయల్స్ నిర్వహించింది.
కాళ్లు చేతులు మంచానికి కట్టేసేవారు..
ట్రయల్స్‌లో టీకా డోసు తీసుకున్న తర్వాతే తనలో ఈ దుష్పరిణామాలు సంభవించాయని సదరు వాలంటీర్ ఆరోపించారు. ఇంకా తాను పూర్తిగా కోలుకోలేదని, ఎన్నాళ్లకు సాధారణ స్థితికి రాగలనో కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. టీకా తీసుకున్నాక తొలి పదిరోజుల్లో పెద్దగా మార్పు కనిపించలేదని, తర్వాత మెల్లగా తన ప్రవర్తనలో మార్పులు వచ్చాయని వివరించారు. ఒక్కోసారి తనను అదుపులో పెట్టడానికి కాళ్లు, చేతులు మంచానికి కట్టేసేవారని నోటీసుల్లో పేర్కొన్నారు. మనుషులను గుర్తుపట్టేవారు కాదని, మాట్లాడేవారూ కాదని, కొత్త మనిషిలా.. ఏమీ ఎరగనట్టు విచిత్రంగా ప్రవర్తించారని ఆయన భార్య చెప్పారు. టీకా కారణంగా మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపే ఎన్సెఫలోపతితో తాను బాధపడ్డారని, ఇది టీకా డోసు వల్లే ఏర్పడిందని టెస్టుల్లో తేలినట్టు తెలిపారు.
ఆరోపణలు కుట్రపూరితం : సీరం
లీగల్ నోటీసులోని ఆరోపణలు కుట్రపూరితమని, తప్పుగా గ్రహించినవని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. వాలంటీర్ ఆరోగ్య పరిస్థితిపై సానుభూతి చూపుతున్నదని, కానీ, ఆయన అనారోగ్యానికి, టీకా ట్రయల్స్‌కు సంబంధమే లేదని ఓ ప్రకటనలో పేర్కొంది. వాలంటీర్ అనారోగ్యానికి ట్రయల్స్ కారణమని అవాస్తవాన్ని ప్రచారం చేశారని, ఇలాంటి నిందాపూరిత వదంతుల వెనుక కారణం డబ్బు గుంజడమే లక్ష్యంగా కనిపిస్తున్నదని వివరించింది. వాలంటీర్ అవాస్తవాలను ప్రచారం చేసినందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూ. 100 కోట్లకు మించి నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నదని తెలిపింది. వారు చేసిన తప్పుడు వాదనలపైనా పోరాడతామని స్పష్టం చేసింది.
దర్యాప్తు చేస్తున్నాం
వాలంటీర్ ఎదుర్కొన్న సమస్యలకు టీకా కారణమా? అనే విషయాన్ని తెలుసుకునే ప్రక్రయను ట్రయల్స్ నిర్వహించిన సైట్‌లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), ఇన్‌స్టిట్యూటషనల్ ఎథిక్స్ కమిటీలు మొదలుపెట్టాయి. ఈ ఆరోపణలపై వేగంగా ఆగమేఘాల మీద చేసే దర్యాప్తు ఫలితాలపై ప్రభావాన్ని చూపొచ్చని ఐసీఎంఆర్‌లోని ఎపిడమాలజీ అండ్ కమ్యూనికేబుల్ డిసీసెస్ డివిజన్ హెడ్ సమిరాన్ పాండా తెలిపారు. డీసీజీఐ, ఎథిక్స్ కమిటీలు దర్యాప్తు చేస్తున్నాయని వివరించారు.