వైజాగ్ విషవాయువు రియాక్షన్స్ బయటపడుతున్నాయి

by srinivas |   ( Updated:2020-05-09 01:07:52.0  )
వైజాగ్ విషవాయువు రియాక్షన్స్ బయటపడుతున్నాయి
X

దిశ ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగి నేడు మూడు రోజులవుతోంది. ఈ దుర్ఘటన నుంచి ఆ ప్రాంతం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పూణే, నాగ్‌పూర్, గుజరాత్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు రియాక్షన్ చూపించడం ఆరంభించింది.

ఎల్జీ పాలిమర్ విషవాయువు పీల్చిన ఘటనలో కింగ్ జార్జ్ ఆస్పత్రిలో 300 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 52 మంది చిన్నారులు. మిగిలిన వారంతా పట్టణంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై కొందరుంటే, ఐసీయూలో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇదివరకు ఉన్న ఆరోగ్య సమస్యలు తిరిగి ఆరంభమయ్యాయని తెలుస్తోంది. వీటితో సతమతమవుతున్న బాధితులను గ్యాస్ పీల్చడం యొక్క రియాక్షన్స్ బయటపడుతున్నాయి.

బాధితుల్లో కొందరికి ఒంటిపై బొబ్బలు, పొక్కులు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మందిని దురద బాగా ఇబ్బంది పెడుతోంది. దురదగా ఉందని, మంటపడుతోందని ఏమాత్రం తాకినా అక్కడ చర్మం కమిలిపోయి బొబ్బలు పుట్టుకొస్తున్నాయి. దీంతో చర్మవ్యాధుల (డెర్మటాలజిస్ట్స్) నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు.

మరికొందరు బాధితులకు ఇంకా వికారం పోలేదు. దీంతో తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇంకొందరు ఇంకా బిత్తర చూపులు చూస్తున్నారు. దీంతో కేజీహెచ్ వైద్యులు వారందరికీ శరీర అవయవాల పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయిస్తున్నారు. అలాగే గుండె, కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు కూడా చేస్తున్నారు.

Tags: lg polymers, vizag gas leak, ap, visakhapatanam, health report

Advertisement

Next Story

Most Viewed