పరేషానీ విల‘నిజం’!

by Shyam |
పరేషానీ విల‘నిజం’!
X

సినిమా.. అత్యంత ప్రభావవంతమైన వినోద మాద్యమం. అందులోని కథ, పాత్రలు, పాత్రధారులు ప్రవర్తించే తీరు, సంభాషణలు ఇవన్నీ కల్పితాలే. అది సినిమా చూస్తున్న ప్రేక్షకుడికీ తెలుసు. అయినా సినిమా చూస్తున్నంత సేపు అందులోనే లీనమై, ఆ పాత్రలోనే ప్రయాణించేలా చేయడమే సినిమాకున్న మ్యాజిక్ పవర్. అయితే సినిమాల్లో కథానాయకులకు ఉన్నంత ప్రాముఖ్యత ఇతర నటులకు ఉండదన్న విషయం మనకు తెలిసిందే. అందునా, మన తెలుగు సినిమాల్లో కథానాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరువాత కాస్తో కూస్తో ప్రాముఖ్యత ఉండేది ప్రతినాయకులకే అదేనండోయ్.. విలన్లకి. మరి తమదైన నటకౌశలంతో విలన్‌కు స్టార్‌డమ్ తెచ్చిన క్యారెక్టర్లపై ఓ లుక్కేద్దాం..

ప్రతినాయకుడంటే ఆహార్యంలో కాస్త విలక్షణత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ, విలక్షణత కావలసింది ఆహార్యంలో కాదు, అభినయంలో అని నిరూపించి విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన మహా నటులు ఎస్వీ రంగారావు. ఈయన పేరు వినగానే ఆయన పోషించిన పాత్ర ఒక్కటైనా మన కళ్ల ముందు ప్రత్యక్షమ్వక మానదు. ఆ తరువాత ప్రభాకర్ రెడ్డి, నాగభూషణం, రావు గోపాల రావు, కైకాల సత్యనారాయణ వంటి నటులు తెలుగుతెరకు ప్రతినాయకుడి లోటును తీర్చారు. వీరి తర్వాతి తరంలో ప్రతినాయక పాత్రలకు ‘కోట శ్రీనివాస రావు’ పెట్టింది పేరు. ఆయన చేయని పాత్రంటూ లేదు. అయితే ‘మన పెరట్లో మొక్క వైద్యానికి పనికి రాదు’ అన్న చందాన మన తెలుగు దర్శక నిర్మాతలకు సైతం పరభాషా విలన్లపై మోజు ఎక్కువ. నటనలో ఓనమాలు రానివారిని సైతం ఇక్కడకు దిగుమతి చేసుకుని వారికి స్టార్ స్టేటస్ కల్పించడం తెలుగు సినీ పరిశ్రమకున్న అలవాటు.

అలా దిగుమతి చేసుకున్న వారిలోనూ తమ ప్రతిభతో మెప్పించిన వారున్నారు. వీరిలో ‘అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, రఘువరన్, ఆ తర్వాత ‘ప్రకాశ్ రాజ్’ ఇతరులు ప్రముఖంగా కనిపిస్తారు. వీరంతా తమ నటనతోనే అవకాశాలను కల్పించుకున్నారు. ప్రకాశ్ రాజ్ అయితే తెలుగును అనర్గళంగా తన మాతృభాష కన్నడ వలెనే మాట్లాడగలడు. వీరితో సమస్యే లేదు. సమస్యల్లా.. భాష రాని, ముఖంలో ఏ భావం పలకలేని స్టైలిష్ పరభాషా విలన్లతోనే. కండ్లకు రేబాన్ గ్లాస్, నోట్లో సిగార్, సూటు, బూటు అంతేనా.. పేమెంటేమో ఫుల్.. ఎక్స్‌ప్రెషన్ మాత్రం నిల్. చాలా సార్లు సీనియర్ నటులు ‘కోట శ్రీనివాస రావు’ గారు బహిరంగంగానే ఈపాటి నటులు తెలుగులో లేరా అని విమర్శలు గుప్పించారు. ‘చంపండిరా.. నరకండిరా..’ అని డైలాగులు పలికేందుకు ఇంత ఖర్చుపెట్టాలా అంటూ తెలుగు దర్శక నిర్మాతలకు చురకలంటించారు.

ప్రపంచం కుగ్రామంగా మారిన పరిస్థితుల్లో సినిమా రంగం కూడా ‘కళాత్మకతను వీడి కమర్షియల్ హంగులను పునికిపుచ్చుకుంటోంది. భాషకు హద్దుల్లేవనే మాటలు వినిపిస్తున్నా.. మన తెలుగు నటులకు కూడా మిగతా భాషల్లో ఇదే రకమైన ప్రాధాన్యత దక్కుతుందా లేదా అన్నదే ప్రశ్న.

Advertisement

Next Story

Most Viewed