మనోధైర్యం కోసం ఒక్కసారి మా ఊరికి రా సారూ

by Shyam |

దిశ, మెదక్: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి తిరిగిన మాదన్నపేట గ్రామానికి మంత్రి హరీశ్ రావు రావాలంటూ ఆ గ్రామస్తులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని ఓ మారుమూల గ్రామమే ఈ మాదన్నపేట. ఢిల్లీ నుంచి వచ్చిన గజ్వేల్ నివాసి మాదన్నపేట మసీదులో ఒక రోజు ప్రార్థన చేసుకొని వెళ్లిపోయాడు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే మాదన్నపేటలో జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు చేరుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు శరవేగంగా చేపట్టి, ఒకరికొకరు దూరంగా ఉండాలని, ఇల్లు విడిచి బయటకు రావొద్దని, గుంపులు గుంపులుగా తిరగవద్దు అని ఆంక్షలు విధించారు. ఇక గ్రామంలో కరోనా వైరస్ మహమ్మారిని తరిమేందుకు చర్యలు చేపడుతున్నారు. అయినా, గ్రామస్తులు ఏదో ఒక వెలితితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి మానసిక ధైర్యం ఇవ్వడానికి మంత్రి హరీశ్ రావు తమ గ్రామానికి రావాలంటూ వేడుకుంటున్నారు. గజ్వేల్, సంగారెడ్డి , నర్సాపూర్ సిద్దిపేటలో ప్రజలకు ఆయన ఇస్తున్న మనోధైర్యం కొండంత అండగా నిలుస్తుందంటున్నారు. తమ గ్రామాన్ని కూడా సందర్శించి మానసిక బలాన్ని ఇవ్వాలంటూ కోరుకుంటున్నారు. ఇక గ్రామస్తులకు మనోధైర్యం నింపడానికి మంత్రి హరీశ్ రావు వస్తారో లేదో వేచిచూడాల్సిందే.

Tags: harish rao, madannapet Villagers, request, Self confidence, corona positive case

Advertisement

Next Story