- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇద్దరు మంత్రులు సైతం ఫెయిల్.. CM రేవంత్ సర్వేలో సంచలన విషయాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి పెరుగుతున్నదా? సొంత నియోజకవర్గాల్లో వారు పట్టుకోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలపైనా ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, లీడర్లు, ఆ పార్టీల ఎమ్మెల్యేల పనితీరుపై రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి జరిపించిన సర్వేల్లో కీలక అంశాలు బహిర్గతం అయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
మూడు పార్టీలపై సీఎం సర్వే
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో సొంత పార్టీ పనితీరుతో పాటు విపక్షపార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారోనని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పలు సర్వేలు జరిపించినట్టు తెలుస్తున్నది. నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు, అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ సందర్భంగా ఆరా తీసినట్టు తెలిసింది. సెగ్మెంట్‌లలో పార్టీలు, ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందా? పెరిగిందా ? తగ్గితే ఎందుకు తగ్గింది? సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు ? ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు? అనే కోణంలో ఆరా తీసినట్టు తెలిసింది. సర్వే రిపోర్టుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం కోసం సీఎం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
వాడిన కమలం
ఆరు నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయనే డిస్కషన్ జరిగింది. కానీ ఆ పార్టీ లీడర్లు ఎక్కువగా ప్రెస్‌మీట్‌లకే పరిమితం అవుతున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జరిపించిన సర్వేల్లో బీజేపీ గ్రాఫ్ ఊహించనంత ఘోరంగా పడిపోయినట్టు వెల్లడైందని తెలిసింది. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా బలహీనంగా ఉందని సమాచారం. కొన్ని చోట్ల ఆ పార్టీ ఉనికే లేదనే తీరుగా ప్రజల నుంచి స్పందన వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలకు గతంలో ఉన్నంత పాజిటివ్ ఇప్పుడు లేదని రిపోర్టులో వెల్లడైనట్టు తెలుస్తున్నది.
గులాబీ బాస్‌పై తగ్గని వ్యతిరేకత
సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్టు తెలిసింది. అయితే కేసీఆర్ పై ప్రజల్లో ఇంకా నెగిటివ్ పోలేదని, అందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నట్టు సమాచారం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఇప్పటికీ మరిచిపోకపోవడం ఒక కారణమైతే, విపక్ష హోదాలో కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండటం రెండో కారణంగా తెలుస్తున్నది. ఈ ఏడాదిలో అసెంబ్లీ నాలుగు సార్లు సమావేశమైతే, కేసీఆర్ మాత్రం కేవలం ఒక రోజు వచ్చారు. అది కూడా ఎలాంటి చర్చలు జరగని బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. అయితే విపక్షనేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా, ఫామ్ హౌజ్ కే పరిమితం కావడం సరికాదని అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, పార్టీ అధికారంలో కోల్పోయినా సదరు ఎమ్మెల్యేల హంగు ఆర్బాటం తగ్గలేదని ప్రజలు ఫీలవుతున్నట్టు తెలుస్తున్నది.
10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై నెగిటివ్
కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై ప్రజలు నెగిటివ్‌గా ఫీలవుతున్నట్టు తెలుస్తున్నది. నెగిటివ్ రిపోర్టు లిస్టులో ఉన్న మంత్రుల్లో ఇద్దరికి తమ అనుచరులు, బంధువుల తీరే పెద్ద సమస్యగా మారినట్టు తెలుస్తున్నది. అలాగే ఫెయిల్ మార్కులు వచ్చిన జాబితాలో మెజార్టీ మంది కొత్త ఎమ్మెల్యేలు ఉండగా, ఒకరిద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ దందాల్లో జోక్యం చేసుకోవడం, సన్నిహితులు, బంధువుల దూకుడు పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కేడర్ తో సన్నిహిత సంబంధాలు కోల్పోవడం, ప్రజలకు దూరంగా ఉండటం, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు వివరించట్లేదని రిపోర్టులో పేర్కొనట్టు తెలిసింది. అయితే పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను విడివిడిగా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే యోచనలో సీఎం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
పెరిగిన రేవంత్ గ్రాఫ్
సీఎంగా రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రజలు సంతృప్తి గా ఉన్నారని, ఈ ఏడాది కాలంలో ఆయన గ్రాఫ్ పెరిగినట్టు సర్వేల్లో వెల్లడైందని తెలుస్తున్నది. అయితే ఆయన పబ్లిక్ మీటింగ్స్ మాట్లాడే భాష తీరు మారడం మంచిదని ప్రజలు ఫీలవుతున్నట్టు తెలిసింది. రైతు భరోసా స్కీమ్ ఆలస్యం అవడంపై మెజార్టీ ప్రజలు నెగిటివ్ ఫీలయ్యారని, ఆసరా స్కీమ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం.