వెంటిలేటర్ల ఎగుమతిపై నిషేధం

by Shamantha N |
వెంటిలేటర్ల ఎగుమతిపై నిషేధం
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మన దేశం నుంచి ఇతర దేశాలకు వెంటిలేటర్లు సహా శానిటైజర్ల ఎగుమతిపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. అయితే ఇప్పటికే షిప్పుల ద్వారా లేదా కార్గో విమానాల ద్వారా రవాణా అయిన సరుకు యధావిధిగా వెళ్ళవచ్చని, ఇకపైన ఎగుమతి ఆర్డర్లకు మాత్రం అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ‘ఫారిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్’ అమిత్ యాదవ్ స్పష్టం చేశారు. వెంటిలేటర్లు మాత్రమే కాక శ్వాసకోశ సంబంధ కృత్రిమ ఉపకరణాలు, ఆక్సిజన్ థెరపీలో వాడే పరికరాలు, ఊపిరితిత్తులకు వాడే ఏ రకమైన వైద్య పరికరాలైనా ఎగుమతి చేయడానికి వీలు పడదని స్పష్టం చేశారు. శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం కూడా తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా శానిటైజర్లకు, వెంటిలేటర్లకు తీవ్రమైన కొరత ఉన్న సమయంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఐటీసీహెచ్ఎస్ ఎగుమతి పాలసీలోని రెండవ షెడ్యూలుకు సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీన వెలువరించిన నోటిఫికేషన్ ద్వారా ఈ ఉత్తర్వులను మార్చి 24వ తేదీన వెలువరించింది. దేశం మొత్తానికి వర్తించే నిబంధన కావడంతో ఏ రాష్ట్రం నుంచి కూడా వెంటిలేటర్ల ఎగుమతి వీలు పడదు. కరోనా వ్యాప్తి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పాజిటివ్ పేషెంట్లకు ఏర్పడే అవసరానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మాస్కులపై ఎగుమతి నిషేధం అమలవుతోంది.

tags: Corona, Ventilator, Export, Banned, Union Commerce Ministry

Advertisement

Next Story