‘భారతీయులను కాదని టీకాలు ఎగుమతి చేయలేదు’

by Shamantha N |
‘భారతీయులను కాదని టీకాలు ఎగుమతి చేయలేదు’
X

న్యూఢిల్లీ: భారతదేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలను విదేశాలకు ఎగుమతి చేయలేదని సీరం ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ ఇండియా పునరుద్ఘాటించింది. ఇటీవలి కాలంలో టీకా ఎగుమతులపై విస్తృత చర్చ జరుగుతున్నదని, ఈ సందర్భంలో తాము భారత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మనదేశంలో జనవరిలో టీకా పంపిణీ ప్రారంభించినప్పుడు అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయని, అప్పుడు విదేశాల్లో టీకా అవసరం ఎక్కువగా ఉన్నదని వివరించింది. ఆ సందర్భంలోనే భారత ప్రభుత్వం ఇతర దేశాలకూ సహాయ హస్తం అందించిందని, ఆ క్రమంలోనే టీకాలు ఎగుమతి చేశామని తెలిపింది.

మహమ్మారి కేవలం ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితమైనది కాదని గుర్తుంచుకోవాలని, ప్రపంచంలో ప్రతిప్రాంతం కరోనాను జయించనంత కాలం అందరికీ ముప్పు ఉండనే ఉంటుందని వివరించింది. అప్పుడు భారత్ చేసిన సహాయానికి ప్రతిఫలమే నేడు విదేశాలూ మనకు అండగా నిలుస్తున్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే కొవాక్స్ ఫెసిలిటీకి తాము కమిట్‌మెంట్ ఇచ్చామని తెలిపింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల రెండు దేశాల్లో మనదీ ఒకటని, అందుకే ఇక్కడ రెండు మూడు నెలల్లో అందరికీ సంపూర్ణంగా టీకా వేయడం సాధ్యపడదని పేర్కొంది. యావత్ ప్రపంచమంతా టీకా పంపిణీ పూర్తి చేయడానికి రెండు మూడేళ్లు పట్టవచ్చునని తెలిపింది. టీకా ఎగుమతులపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన తరుణంలో సీరం ఈ వివరణ ఇవ్వడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed