పోలీస్ శాఖలో ఇది కాదనలేని నిజం

by Anukaran |   ( Updated:2020-08-29 23:06:51.0  )
పోలీస్ శాఖలో ఇది కాదనలేని నిజం
X

దిశ, క్రైమ్ బ్యూరో : కొలువు ఖాళీగానే ఉంటుంది… అధికారీ అందుబాటులోనే ఉంటాడు… కానీ భర్తీ చేయడం మాత్రం జరుగదు.. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రభావితమైన నేతకు అన్నీ అనుకూలమైతేనే ఆ పోస్టు భర్తీ అవుతుంది. రాష్ర్టంలో ఏ శాఖ తీరు తీసుకున్నా ఇదే పరిస్థితి అయినా, పోలీస్​ శాఖకు వచ్చే సరికి ఈ వ్యవహారం మరింత ఎక్కువే. ఆ శాఖ బదిలీలు, ప్రమోషన్లలో అధికారులు నేతలను తీవ్రంగా ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో చక్రం తిప్పే నేత, సామాజిక సమీకరణాలు అన్నీ అనుకూలిస్తేనే అధికారికి కోరుకున్న చోట పోస్టింగ్​ ఉంటుంది. లేదంటే సీటు ఖాళీగా ఉండాల్సిందే తప్ప ఎవరో ఒకరిని నియమించుకునే వీలు అసలే ఉండదు. దీంతో పలు జిల్లాల్లో ఖాళీ పోస్టుకు అధికారులున్నా కోటరీ గణాంకాలు సరిపోక కూర్చీలు బోసిపోయే కనిపిస్తున్నాయి.

నేతల అంగీకారం తప్పనిసరి..

పోలీసు శాఖలో సీఐ, డీఎస్పీ స్థాయి ఆపై పోస్టులన్నీ పొలిటికల్ పోస్టింగ్స్ అనే నానుడి ఉంది. ఈ స్థాయి అధికారులు నచ్చిన చోటుకు పోస్టింగ్ కావాలంటే, స్థానిక ప్రజాప్రతినిధుల అనుమతి కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో రాజకీయ వివాదాలతో పాటు స్థానిక గ్రూపు తగాదాలు, కుటుంబ, ఆస్తి గొడవలకు సంబంధించిన కేసులే ఎక్కువగా వస్తుంటాయి. ఆ సమయంలో సంబంధిత పోలీసు అధికారికి బాధితులు నేతల నుంచి పైరవీలు చేయిస్తుంటారు. ఇలాంటి కారణాల దృష్ట్యా అనుకూలమైన అధికారి వస్తే పనులు ఇట్టే చక్కబెట్టుకోవచ్చని రాజకీయ నేతలు తమ అనుయాయులతో ఆ పోస్టులను భర్తీ చేయించుకుంటున్నారు. స్థానికతతో పాటు సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.

సరైనోడు కోసం వెయిటింగ్..

రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక ప్రజా ప్రతినిధులను కాదనీ బదిలీలు, నియామకాలు చేసే పరిస్థితిలో ఉన్నతాధికారులు కూడా లేరనేది కాదనలేని విషయం. లాక్ డౌన్ పీరియడ్ లో నాలుగు నెలల కిందట వివాదాస్పదంగా బదిలీ అయిన ఖమ్మం ఏసీపీ పోస్టు ఇంకా ఖాళీగానే ఉండటం గమనార్హం. ఈ పోస్టు కోసం పలువురు డీఎస్పీలు ట్రై చేసినా ఖమ్మం ఖిల్లాలో రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆధిపత్యం వహించే సామాజిక వర్గానికి చెందిన అధికారుల కోసమే ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగు నెలలుగా ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఖమ్మంలో ఏసీపీగా పనిచేసే సత్తా ఉన్న అధికారే డిపార్ట్​మెంట్​లో లేరా, లేక స్థానికంగా ప్రసన్నం చేసుకునే ఆఫీసర్​ కరువయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇటీవల సస్పెన్షన్ కు గురైన ఇంకో అధికారి త్వరలో ప్రమోషన్ లిస్ట్​లో ఉండడంతో కోరుకున్న పోస్టింగ్ కోసం హైదరాబాద్ లోని ఓ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకున్నట్టు కూడా విశ్వాసనీయ సమాచారం.

Advertisement

Next Story

Most Viewed