దుబ్బాక అభ్యర్థిని రేపు ప్రకటిస్తాం : కాంగ్రెస్

by Anukaran |
దుబ్బాక అభ్యర్థిని రేపు ప్రకటిస్తాం : కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇంకా అభ్యర్థులను ప్రకటించకముందే పలు పార్టీలు నియోజకవర్గంలో ప్రచారం మొదలెట్టాయి. బీజేపీ నుంచి రఘునందర్ రావు, టీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు విస్తృతంగా ప్రచారాలు చేస్తూ, ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థిని మంగళవారం ప్రకటిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రస్‌ ఘటనకు నిరసిస్తూ… సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

అనంతరం ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ… దుబ్బాక అభ్యర్థిత్వంపై పార్టీలో ఇంకా చర్చ జరుగుతోందని.. రేపటికి అది ఓ కొలిక్కి వస్తుందని చెప్పారు. రాజకీయాన్ని టీఆర్ఎస్ వ్యాపారంగా మార్చేసిందని.. విలువలను దిగజారుస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కవితను అనర్హురాలిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్టు ఉత్తమ్‌ తెలిపారు. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఉత్తమ్‌ నిరాకరించారు. ఈ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

హథ్రస్‌ ఘటన దేశాన్ని కలచివేసిందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. హథ్రస్‌ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రదర్శించిన తీరు అత్యంత దారుణమని ఉత్తమ్‌ విమర్శించారు. కేసును సీబీఐకి ఇచ్చామని చెబుతున్నారని.. మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత విచారణ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ అగ్రనేతలను అరెస్ట్‌ చేయడంపై మండిపడ్డారు. బ్రిటీష్‌ పాలకుల కంటే దారుణంగా బీజేపీ పాలకుల తీరు ఉందని ఉత్తమ్‌ ఆగ్రహించారు.

Advertisement

Next Story

Most Viewed