స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. ఇలా తెలుసుకోవచ్చు

by Harish |
స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. ఇలా తెలుసుకోవచ్చు
X

దిశ వెబ్ డెస్క్: స్మార్ట్‌ ఫోన్‌ మనిషి జీవితంలో ఓ కీ రోల్ పోషిస్తుంది. సెల్‌ఫోన్‌ లేనిదే చాలామందికి రోజు గడవదు. ఏ పని కూడా జరగదు. స్మార్ట్‌ ఫోన్‌ లో మనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఫోన్‌ కాంటాక్స్ట్‌ ఇలా ఎన్నో ఉంటాయి. అందుకే పర్సు పోయినా బాధపడని మనం.. స్మార్ట్‌ ఫోన్‌ పోతే ప్రాణం పోయినంత విలవిల్లాడిపోతాం. మనం పదిలంగా చూసుకునే స్మార్ట్‌ ఫోన్‌ పోతే ఇంతకీ ఏం చేయాలి? పోయిన మొబైల్‌ను వెతికి పట్టుకోవడం సాధ్యమేనా? ఆ ఫోన్‌ ఏ ప్రదేశంలో ఉందో? ఎవరు ఉపయోగిస్తున్నారో తెలుసుకోచ్చా?

ఆండ్రాయిడ్‌ ఫోనైనా, యాపిల్‌ డివైసైనా.. లేటెస్ట్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌ యూజ్‌ చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ ఫీచర్స్‌ను ఉపయోగిస్తేనే పొగొట్టుకున్న స్మార్ట్‌ ఫోన్ల ఆచూకీ దొరికే అవకాశం ఉంటుంది. గూగుల్‌ అందిస్తున్న ఫీచర్స్‌తో ఫోన్‌ ఎక్కడుందో తెలుసుకోవడంతోపాటు ఫోన్‌ను లాక్‌ కూడా చేయవచ్చు. ఇందుకోసం స్మార్ట్‌ ఫోన్‌లోని సెక్యూరిటీ సర్వీస్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది కేవలం సిమ్ బ్లాక్ చేయిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఆ ఫోన్‌కు సెక్యూరిటీ కోడ్ పెట్టకపోతే.. అందులోని సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఫైండ్ మై ఫోన్:

స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు “ఫైండ్ మై ఫోన్ ఫీచర్’ ఉపయోగించవచ్చు. గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ చేస్తే ఫోన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది.

అండ్రాయడ్ డివైస్ మేనేజర్:

స్మార్ట్‌ఫోన్‌ ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఏదైనా ప్రాంతంలో మర్చిపోయినా వెంటనే ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ యాప్‌ను వినియోగించుకోవడం లేదా ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ వెబ్‌సైట్‌లోకి గూగుల్‌ అకౌంట్‌ సహాయంతో లాగిన్‌ అవ్వడం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనే అవకాశం ఉంది. ఫోన్‌ ఆన్‌ చేసి ఉంటే డివైస్‌ లొకేషన్‌ మ్యాప్‌లో కనిపిస్తుంది. ఫోన్‌ ట్రేస్‌ అయితే.. రింగ్‌, లాక్‌, ఎరేజ్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. లాక్‌ ఆప్షన్‌తో ఫోన్‌కు లాక్‌ వేయొచ్చు. ఎరేజ్‌తో ఫోన్‌లోని డేటా అంతా ఎరేజ్‌ చేయొచ్చు. గూగుల్‌ డ్యాష్‌ బోర్డ్‌ ద్వారా కూడా మీ ఫోన్‌ను ట్రేస్‌ చేయవచ్చు. ఇందుకోసం గూగుల్‌ డ్యాష్‌ బోర్డు ఓపెన్‌ చేసి మన ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వార్డ్‌తో లాగిన్‌ అయితే.. మన ఫోన్‌ ఎక్కడుందో లొకేట్‌ చేస్తుంది. అంతేకాకుండా.. ఆ ఫోన్‌లో ఏయే వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ చేశారు, ఆ ఫోన్‌ నుంచి ఎవరికి కాల్‌ చేశారు, ఎవరికి మెసేజ్‌ చేశారో కూడా తెలసుకోవచ్చు. ఇక్కడి నుంచే మన ఫోన్‌ను లాక్‌ చేయవచ్చు. డేటాను ఎరేజ్‌ చేయవచ్చు.

గూగుల్ మ్యాప్స్:

అలాగే గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ మన ప్రతీ కదలికను రికార్డ్ చేస్తుంది. ఆ వివరాలన్నీ టైమ్‌లైన్‌లో ఉంటాయి. www.maps.google.co.in ఓపెన్ చేసి మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే ‘Your timeline’ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే అందులో మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారు? ఎంత సేపు ఉన్నారు? అనే వివరాలు ఉంటాయి. ఈ రోజు మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ‘Today’ పైన క్లిక్ చేస్తే చాలు. చివరిసారిగా మీ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. ఇలా మీ ఫోన్ ని గుర్తించవచ్చు. ఇవే కాకుండా మరికొన్ని యాప్స్‌ కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉన్నాయి.

Tags: smart phone, my device, google maps, find my phone

Advertisement

Next Story

Most Viewed